
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
చండూరు, మర్రిగూడ, వెలుగు : గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో తాగునీరు, ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలంలో ఉన్న గ్రామాలు, తండాలకు మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడకూడదని, గ్రామాలు, తండాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
తాగునీటి సరఫరాను ప్రతిరోజు పర్యవేక్షించాలని, ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అన్ని పనులు పూర్తిచేయాలని చెప్పారు. సమావేశంలో చండూరు ఆర్డీవో శ్రీదేవి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడివో మునయ్య తదితరులు పాల్గొన్నారు.