
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లాలో ఆహార భద్రత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు శారద, భారతి, జ్యోతి మంగళవారం జిల్లాలోని కొండమల్లేపల్లి, దేవరకొండ మండలాల్లో జాతీయ ఆహార భద్రత చట్టం –2013 అమలు తీరును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్, సభ్యులకు కలెక్టర్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు సన్నబియ్యంతో భోజనం, పప్పు, బాలామృతం, గుడ్డు, పాలు, పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని వివరించారు. తృణధాన్యాలతో లడ్డూలను ప్రత్యేకంగా తయారు చేయించి గర్భిణులు, కౌమార బాలికలకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, సంక్షేమ వసతి గృహాల్లో సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం పెడుతున్నామని తెలిపారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్డీవో శేఖర్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల ఇన్చార్జి అధికారి హరీశ్, జిల్లా సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి, గిరిజన సంక్షేమశాఖ అధికారి చత్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.