విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

కేతేపల్లి, (నకిరేకల్) వెలుగు:  విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం  కేతేపల్లి మండలం బొప్పారం మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై  ప్రిన్సిపాల్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ ఆవరణ ఎప్పటికప్పుడు శుభ్రంగాఉంచాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

పాఠశాల ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. స్కూల్​కు అవసరమైన మౌలిక వసతులను వెంటనే కల్పించాలని  రీజనల్ కోఆర్డినేటర్ ను, పాఠశాల ప్రిన్సిపాల్ కు సూచించారు. విద్యార్థులతో మాట్లాడి శుభ్రతపై అవగాహన కల్పించారు. కలెక్టర్ వెంట కేతేపల్లి తహసీల్దార్ ఉన్నారు.

వలస కార్మికులకు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి 

నకిరేకల్ : ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులకు వచ్చేవారం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్  ఇలా త్రిపాఠి హాస్పిటల్​ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. బుధవారం ఆమె నకిరేకల్ లోని ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. అనంతరం పక్కనే నిర్మాణంలో ఉన్న కొత్త హాస్పిటల్​ బిల్డింగ్​ పరిశీలించి పనులు స్పీడప్​ చేయాలని సూచించారు.