నల్గొండ జిల్లా: ‘ఒకేఒక్కడు’ సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్జున్ కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకుంటాడు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అధికారులను, ఉద్యోగులను ఏమాత్రం ఉపేక్షించకుండా ఊస్టింగ్ ఆర్డర్ ఇస్తుంటాడు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా ఇంచుమించు ఇలాంటి నిర్ణయమే తీసుకుని వార్తల్లో నిలిచారు. విధుల్లో అలసత్వం వహించిన పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 100 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నెలల తరబడి విధులకు గైర్హాజరు కావడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కలెక్టర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. 100 మంది పంచాయతీ కార్యదర్శులు ఆరు నెలల పాటు చెప్పాపెట్టకుండా విధులకు గైర్హాజరు అవడంపై వివరణ ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. కొంతమంది పంచాయతీ కార్యదర్శులు అనారోగ్యం పేరుతో విధులకు గైర్హాజరు అయి కూడా జీతాలు తీసుకున్నట్లు కలెక్టర్ విచారణలో బట్టబయలైంది.
ఈ పంచాయతీ కార్యదర్శుల్లో కొందరు వాళ్ల పోస్టింగ్ కోసం జిల్లా పాలనాధికారి మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్లు కలెక్టర్ దృష్టికి వచ్చింది. టీఎన్జీవో సంఘం డీపీఓ ఆఫీస్ను గుప్పిట్లో పెట్టుకుని పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగం చేయడం మానేసి.. రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారని కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read :- ఎల్ఆర్ఎస్ పూర్తయితే రూ.10 వేల కోట్ల ఆదాయం
ఇంటి పన్నులు వసూలు చేసి చలాన్ కట్టకుండా కార్యదర్శులు సొంతానికి వాడుకున్నారని జిల్లా కలెక్టర్కి ఫిర్యాదులు అందాయి. డబుల్ రసీదు పుస్తకాలు మెయింటెనెన్స్ గురించి అడిగే వారు ఎవరూ లేకపోవడంతో ఆన్లైన్లో తక్కువ చూపించి ఆఫ్లైన్లో ఎక్కువ వసూలు చేసి అధికారులను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.
కలెక్టర్ అనుమతి లేకుండా పంచాయతీ కార్యదర్శులు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఎంబీ (మెజర్మెంట్ బుక్) రికార్డ్ చేశారని ఆరోపణలున్నాయని, ఇలా చేయడం చట్ట విరుద్ధమని కలెక్టర్ మండిపడ్డారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న నల్గొండ జిల్లాలోని కొందరు అధికారుల భరతం పట్టి, అధికార యంత్రాంగాన్ని గాడిన పెట్టేందుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేస్తున్న ప్రయత్నంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.