పెండింగ్​ పనులు పూర్తి చేయాలి:  నల్గొండ కలెక్టర్ 

నల్గొండ అర్బన్​, వెలుగు: జిల్లాలో మన ఊరు -మనబడి, మన బస్తీ- మన బడి కింది చేపట్టిన పెండింగ్​పనులు పూర్తి చేయాలని నల్గొండ కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్​హాల్​లో  మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కింద ఎంపిక చేసిన స్కూళ్ల పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, ఆర్​అండ్​బీ, విద్య, మౌలిక వసతులు, ఆర్  డబ్ల్యూ ఎస్ శాఖల ఈఈ లు, డీఈ లు, ఏఈలు, ఎంఈ ఓ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నతస్థాయి అధికారులు, ఇంజనీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసినప్పుడే అనుకున్న లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు.

మన ఊరు  మనబడి పనులకు  సంబంధించిన ప్రగతి రిపోర్టులను రోజూ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పథకాల అమలులో నల్గొండ జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందంజలో ఉంచడానికి ఇంజనీర్లు, అధికారులు కష్టపడి పనిచేయాలన్నారు. పనులను గ్రౌండింగ్​ చేసి ఆన్​లైన్ లో నమోదు చేయాలని చెప్పారు. పనుల ప్రగతి గురించి ఎప్పటికప్పుడు డీఈఓ కు సమాచారం అందించాలని సూచించారు. రూ. 30 లక్షల లోపు పనులు పూర్తైన చోట్ల  చెల్లింపులు కంప్లీట్​ చేయాలన్నారు.  రూ.30 లక్షలకు పైగా ఉన్న పనులకు సంబంధించిన గ్రౌండింగ్ చేసి ఎంబీలను ఎందుకు రికార్డు చేయడం లేదని ఇంజనీర్లను, అధికారులను ఆయన ప్రశ్నించారు. మరోసారి అలా జరగకుండా చూడాలని ఆదేశించారు. టెండర్లు, ఎంఓయూలు, రిజల్యూషన్ గ్రౌండింగ్, అగ్రిమెంట్లు, ఫొటో క్యాప్చర్ లాంటి పనులు పూర్తైన వెంటనే ఆన్​లైన్​లో లో నమోదు చేయాలని చెప్పారు. ఎఫ్టీవోలు జనరేట్ చేయాలని చెప్పారు. పనులు పూర్తయిన చోట కలరింగ్ పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని చెప్పారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ కుష్బూ గుప్తా, డీఈవో భిక్షపతి, పంచాయతీరాజ్ ఎస్​ఈ జేజేవీఎన్ ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.