- రైతుల వివరాలను ఆన్లైన్ చేయండి
- వడ్ల పైసలు ఖాతాల్లో త్వరగా జమ చేయాలి
- యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదగిరిగుట్ట, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో తూకం కంప్లీట్ అయి.. మిల్లులకు తరలించిన వడ్ల రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలని అధికారులను యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో వడ్లకు సంబంధించిన డబ్బులు తొందరగా జమ అయ్యేలా చూడాలన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, గౌరాయపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను గురువారం ఆమె సందర్శించారు. కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడ్ల కొనుగోలు సెంటర్లలో గోనె సంచుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడ్లను మిల్లులకు పంపే ముందు నిర్ణీత శాతం తేమ ఉండేలా చూడాలని చెప్పారు. అనంతరం గౌరాయపల్లిలో కంటివెలుగు క్యాంపును సందర్శించి కంటిపరీక్షల తీరును పర్యవేక్షించారు. ఇప్పటివరకు ఎంతమందికి పరీక్షలు చేశారు, ఎంతమందికి కళ్లద్దాలు ఇచ్చారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
నర్సరీ నిర్వహణ భేష్
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని గురువారం కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్సరీ నిర్వహణ తీరు, మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కలు వాడిపోకుండా షాడో నెట్ ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు వాటరింగ్ చేయడం చూసి సర్పంచ్ వంటేరు సువర్ణ ఇంద్రసేనారెడ్డి, విలేజ్ సెక్రటరీ కవిత, జీపీ సిబ్బందిని అభినందించారు. మిగతా గ్రామాల సర్పంచులు మాసాయిపేట నర్సరీ నిర్వహణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట డీఆర్డీవో నాగిరెడ్డి, ఎంపీడీవో ప్రభాకర్ రెడ్డి, డీపీఎం సునీల్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ, మాసాయిపేట కారోబార్ కట్కం శ్రీనివాస్, పీఏసీఎస్ సీఈవో గజం ఆంజనేయులు, పీఏసీఎస్, ఐకేపీ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు.