హుజూర్ నగర్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంపై విచారణ జరపాలె

హుజూర్ నగర్ : హుజూర్ నగర్ మున్సిపాలిటీలో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోందని నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు లేఖలు రాస్తానని చెప్పారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఏ ఫైల్ కూడా కదలడం లేదన్నారు. కొంతమంది అధికారుల ప్రమేయంతో హుజూర్ నగర్ లో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని, ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారని ఆరోపించారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని డాక్యుమెంట్లు మాయవుతున్న విధానం, కంప్యూటర్ల లాగిన్ పాస్వర్డ్ లను దొంగిలిస్తున్న పద్ధతిని తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఇదే విషయంపై జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన ధర్నా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాన్ని జయపద్రం చేయాలని పిలుపునిచ్చారు. 

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంపై సమగ్ర విచారణ జరిపించాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకుండా.. అధికారులతో కలిసి కొందరు రూ.2 కోట్ల నిధులను కలెక్టర్ ద్వారా మంజూరు చేయించుకుని.. కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కు ఆ నిధులు మంజూరు చేసే అధికారం లేదన్నారు. మున్సిపాలిటీలో పూర్తిస్థాయిలో పని చేసేందుకు అధికారులు భయపడుతున్నారని చెప్పారు. చివరకు కొంతమంది అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసి, కంప్యూటర్ లాగిన్ పాస్వర్డ్ లను తెలుసుకుంటున్నారని, దీనిపై కమిషనర్, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.