- గొంగిడి మహేందర్ రెడ్డి పై నెగ్గిన అవిశ్వాసం
- జులై 1న డీసీసీబీ కొత్త చైర్మన్ ఎన్నిక
- ఇదివరకే చేజిక్కిన డీసీఎంఎస్
నల్గొండ, వెలుగు : నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాసం నెగ్గింది. 15 మంది డైరెక్టర్లు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడంతో ఆయన పదవి కోల్పోయారు. జిల్లాలో రెండు సహకార సంస్థలు డీసీసీబీ, డీసీఎంఎస్‌లను కాంగ్రెస్ వశం చేయడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సక్సెస్ అయ్యారు.
ఈ రెండు సంస్థలకు కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులే చైర్మన్లు అవుతున్నారు. ఈ నెల 22న డీసీఎంఎస్‌కు జరిగిన ఎన్నికల్లో మంత్రి అనుచరుడు కేతేపల్లి మండలానికి చెందిన బోళ్ల వెంకటరెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. డీసీసీబీ చైర్మన్‌గా రాజగోపాల్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కుంభం శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు.
డీసీసీబీలో నాడు ఒకే ఒక్కడు...
డీసీసీబీలో 19 మంది డైరెక్టర్లకు గాను బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నుంచి కుంభం శ్రీనివాస్ రెడ్డి ఒక్కరే ఎన్నికయ్యారు. కాంగ్రెస్అధికారంలోకి రాగానే పలువురు డైరెక్టర్లు కాంగ్రెస్‌లో చేరినా అవిశ్వాసానికి సరిపడ సంఖ్య రాలేదు. దీంతో మరికొంత మంది బీఆర్ఎస్డైరెక్టర్లను ఆకర్షించడానికి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్రెడ్డితో మాట్లాడి 15 మంది డైరెక్టర్ల మద్దతు సంపాదించారు. ముగ్గురు డైరెక్టర్లు మాత్రమే చైర్మన్వైపు ఉన్నారు. దీంతో ఈనెల 10న డీసీఓకు అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు.
ఈ పరిణామాలరీత్యా మహేందర్ రెడ్డి చైర్మన్ పదవికి రాజీనామా చేస్తారని భావించినా ఆయన మెట్టుదిగలేదు. దీంతో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 13 మంది డైరెక్టర్లను క్యాంపునకు తరలించారు. 17 రోజులు క్యాంపులో ఉన్న డైరెక్టర్లు శుక్రవారం హైదరాబాద్వచ్చి అక్కడి నుంచి నేరుగా ఓటింగ్‌కు తరలివచ్చారు. అమెరికా పర్యటన నుంచి తిరిగివచ్చిన వైస్ చైర్మన్ దయాకర్‌రెడ్డి కూడా ఓటింగ్‌కు హాజరయ్యారు. శుక్రవారం డీసీసీబీ ఆఫీసులో డీసీఓ కిరణ్ సమక్షంలో జరిగిన సమావేశంలో చైర్మన్‌కు వ్యతిరేకంగా 15 మంది డైరెక్టర్లు ఓటేయడంతో తీర్మానం నెగ్గినట్టు ప్రకటించారు.
రెండు నెలల నుంచే స్కెచ్...
డీసీసీబీ పీఠాన్ని దక్కించుకోవడానికి రాజగోపాల్‌రెడ్డి వర్గం రెండు నెలల నుంచి ప్లాన్ చేస్తోంది. డైరెక్టర్లతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. తనపై అవిశ్వాసం పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తెలిసినా చైర్మన్మహేందర్ రెడ్డి లైట్ తీసుకున్నారు. డైరెక్టర్లను క్యాంపునకు తరలిస్తున్నా పట్టించుకోలేదు. చైర్మన్ సొంత గ్రామం వంగపల్లికి చెందిన డైరెక్టర్ రాంచందర్ క్యాంపులో చేరడంతో మిగిలిన వారు కూడా కాంగ్రెస్ వైపు మళ్లారు. ఒక దశలో మహేందర్‌రెడ్డిని వంగపల్లి సొసైటీ చైర్మన్ గానే అనర్హునిగా చేసి బ్యాంకు చైర్మన్పదవి నుంచి తప్పించాలని భావించిన కాంగ్రెస్ నేతలు రెండుసార్లు ఎన్నికల వల్ల ఖర్చు పెరుగుతుందని భావించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
సోమవారం చైర్మన్ ఎన్నిక
అవిశ్వాసంపై ఓటింగ్సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకే కాంగ్రెస్ పార్టీ నేతలు శంకర్ నాయక్, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి , కార్యకర్తలు పెద్ద ఎత్తున డీసీసీబీకి చేరుకున్నారు. 11 గంటలకు డైరెక్టర్లు చేరుకున్నారు. 12 గంటలకు అవిశ్వాసంపై ఓటింగ్ ముగిసింది. వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి తాత్కాలిక చైర్మన్ గా వ్యవహరిస్తారని అధికారులు తెలిపారు.
కొత్త చైర్మన్ ఎన్నిక సోమవారం ఉదయం 9 గంటలకు జరగనుంది. కుంభం శ్రీనివాస్ రెడ్డిని కొత్త చైర్మన్‌గా ఎన్నిక కానున్నారు. వైస్ చైర్మన్‌గా దయాకర్ రెడ్డి కొనసాగుతారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సహకారసంస్థల పదవీకాలం ఉంది. దీంతో కొత్త పాలకవర్గం 8 నెలల పాటు కొనసాగనుంది. ఒకవేళ ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేస్తే ఇదే పాలకవర్గం ఎన్నికలు జరిగే వరకు కొనసాగుతుంది.