అవుట్​​సోర్సింగ్​ ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం

  • నల్గొండ దవాఖాన ఎదుట ఘటన 
  • జీతాలు పెంచడం లేదని మంత్రికి ఫిర్యాదు
  • ఆగ్రహంతో తొలగించిన ఏజెన్సీ నిర్వాహకులు
  • నిద్ర మాత్రలు మింగిన ముగ్గురు  
  • ఎమర్జెన్సీ వార్డులో చికిత్స  

నల్గొండ అర్బన్, వెలుగు: తమకు సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదని, మంత్రికి కంప్లయింట్​ చేసినందుకు ఉద్యోగాల్లోంచి తీసేశారని ఆరోపిస్తూ నల్గొండ ప్రభుత్వ దవాఖాన ఎదుట ముగ్గురు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆత్మహత్యాయత్నం చేశారు. నల్గొండ దవాఖానలో నాలుగు ఏజెన్సీలు ఉండగా సుమారు 200 మంది అవుట్​సోర్సింగ్​ ఎంప్లాయీస్​పని చేస్తున్నారు. వీరికి జీవో 60 ప్రకారం రూ.18 వేలు జీతం ఇవ్వాల్సి ఉండగా, కొందరికి రూ.8 వేలు, మరికొందరికి 11 వేలు ఇస్తున్నారు. దీంతో తమకు అన్యాయం జరుగుతోందని నాగమణి, జానకి, లలిత అనే అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగులు కొద్ది రోజుల కింద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన జీతాలు పెంచాలని అప్పటి సూపరింటెండెంట్ లచ్చునాయక్‌కు ఆదేశాలు జారీ చేశారు.

అయితే, దీన్ని అమలు చేయాల్సింది పోయి ఫిర్యాదు చేసిన వారినే విధుల నుంచి తొలగించారు. దీంతో అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగులంతా శుక్రవారం  దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో నాగమణి, జానకి, లలిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో తోటి ఉద్యోగులు వెంటనే వారిని దవాఖానలో చేర్చారు. ప్రస్తుతం వారు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి కారణమైన కాంట్రాక్టర్​పై చర్య తీసుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. ఏజెన్సీ కాంట్రాక్ట్​రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని ఐఎఫ్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్దన్​ కోరారు.  

మమ్మల్ని సతాయిస్తున్నరు 

ప్రతిదానికి తమను ఏజెన్సీ నిర్వాహకులు సతాయిస్తున్నారని అవుట్​సోర్సింగ్​ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. లీవ్ కావాలనుకుంటే ఏజెన్సీ నిర్వాహకుడి ఇంటికి వెళ్లి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రెండు రోజులు రాకపోతే జీతాలు కట్​చేస్తున్నారన్నారు. పీఎఫ్‌లలో కూడా తేడా ఉందన్నారు. ప్రశ్నిస్తే వేధిస్తున్నారన్నారు.