నల్గొండ జిల్లాలో బీఆర్​ఎస్, కాంగ్రెస్​లో ముదిరిన గొడవలు

  • ఎవరి గోల వారిదే!
  • నల్గొండ జిల్లాలో బీఆర్​ఎస్, కాంగ్రెస్​లో ముదిరిన గొడవలు
  • ఎమ్మెల్యే రవీంద్ర కుమార్​పై కోపంతో సమ్మేళనానికి గుత్తా వర్గం డుమ్మా 
  • నకిరేకల్​లో ఎంపీ కోమటిరెడ్డికి వ్యతిరేకంగా కొండేటి బలప్రదర్శన
  • మునుగోడులో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన కూసుకుంట్ల వ్యతిరేకవర్గం
  • మరోవైపు కాంగ్రెస్​లో పాల్వాయి వర్సెస్​ చల్లమల్ల వార్

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలో గొడవలు రచ్చకెక్కి ‘ఎవరి గోల వారిదే’ అన్నట్లుగా పరిస్థితి ఉంది. తమ నేతల ఒంటెద్దుపోకడలకు నిరసనగా అసంతృప్తులు ఏకమై ఎదురుదాడికి దిగారు. గురువారం నకిరేకల్, దేవరకొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​, బీఆ ర్​ఎస్​లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపాయి. ఇక మునుగోడులో అయితే ఎప్పటిలాగే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి తన వ్యతిరేక వర్గాన్ని కనీసం దగ్గరకు కూడా రానివ్వడం లేదు. కాంగ్రెస్​లో పాల్వాయి స్రవంతి, చలమల్ల కృష్ణారెడ్డి ఒకరి పై మరొకరు రాజకీయంగా దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మూడు నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్​టాపిక్​గా మారాయి. 

దేవరకొండలో క్యాంపు పాలిటిక్స్..

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గురువారం దేవరకొండలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళానానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గం డుమ్మా కొట్టింది. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా గుత్తా వర్గం క్యాంపు రాజకీయాలకు వెళ్లడం ఇది రెండోసారి. మార్చి 26న తిరుపతి క్యాంపునకు వెళ్లిన గుత్తా వర్గం, ఆరోజు జరిగిన చర్చలో భాగంగా ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొనొద్దని తీర్మానించారు. దీనిలో భాగంగానే గురువారం దేవరకొండలో జరిగిన ఆత్మీయ సమ్మేళనాన్ని బైకాట్ చేసి గుట్ట క్యాంపునకు వెళ్లారు.

మీటింగ్​ను బహిష్కరించిన నేతల్లో దేవరకొండ మున్పిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, లీడర్లు వడ్త్యా దేవేందర్, ఎంపీపీ జాన్ యాద వ్ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, మండలి చైర్మన్ సు ఖేందర్ రెడ్డి మధ్య రాజకీయ వైరం నడుస్తోంది. అప్పటి నుంచే గుత్తా వర్గాన్ని ఎమ్మెల్యే దూరం పెట్టారు. గుత్తా అనుచరులనే ముద్ర వేసి పార్టీ కార్యక్రమాలకు పిలవట్లేదని, కనీస గౌరవం ఇవ్వడం లేదని గుత్తా వర్గం ఆరోపిస్తోంది. చెరో రెండున్నరేళ్ల ఒప్పందం మేరకు మున్సిపల్ చైర్మన్ పదవి ఎమ్మెల్యే వర్గానికి చెందిన కౌన్సిలర్ వెంకటేశ్​గౌడ్​కు ఇవ్వాల్సి ఉంది.

ఈ ఒప్పందాన్ని గుత్తా అనుచరుడైన ఆలంపల్లి నర్సింహ ఉల్లంఘించటంతోనే రాజకీయంగా మరింత గ్యాప్ పెరిగింది. అయితే ఎమ్మెల్యే తో అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధమైన గుత్తా వర్గం అవసరమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రవీంద్ర కుమార్​కు వ్యతిరేకంగా వడ్త్యా దేవేందర్​ను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ హై కమాండ్ జోక్యం చేసుకున్నా గుత్తా వర్గం ఒప్పుకోకపోవడంతో నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. 

మునుగోడు బీఆర్​ఎస్​లో ముదిరిన లొల్లి...

మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి ఉప ఎన్నికకు ముందు తన పైన తిరుగుబాటు చేసిన నాయకులను దూరంగానే పెడుతున్నారు. ఎన్నికల టైంలో పార్టీ హైకమాండ్​ ఇరువర్గాలకు సర్దిచెప్పిన ప్పటికీ వేడి ఇంకా చల్లారలేదు. బుధవారం చౌటప్పుల్​ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం మత్స్య సహాకార సంఘం భవన ప్రారంభోత్సవంలో చైర్మన్​ వెన్​ రెడ్డి రాజును పక్కన పెట్టి, చౌటుప్పుల్​ సింగిల్​ విండో చైర్మన్​ దామోదర్​రెడ్డి, సీపీఎం మున్సిపల్​ వైస్ ​చైర్మన్​ శ్రీశైలంతో రిబ్బన్​ కట్​ చేయించారు. వెన్​రెడ్డి రాజు పైన అవిశ్వాస తీర్మానం పెట్టించి వైస్​ చైర్మన్​ శ్రీశైలంను చైర్మన్​ చేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది. 

స్రవంతి వర్సెస్​ కృష్ణారెడ్డి

కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ పదవుల వ్యవహారంలో పాల్వాయి స్రవంతి, రేవంత్​ వర్గీయుడు చలమల్ల కృష్ణారెడ్డి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యే అభ్యర్థిని అని కృష్ణారెడ్డి ప్రకటించుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఈ ప్రకటన వెల్లడైన తెల్లారే స్రవంతి మండల కమిటీల రద్దు గురించి ఠాక్రేకు ఫిర్యాదు చేయడం, ప్రెస్​మీట్​లో కృష్ణారెడ్డి పైన దుమ్మెత్తిపోయడం జరిగింది. దీనికి కౌంటర్​గా బుధవారం కృష్ణారెడ్డి వర్గం స్రవంతి వ్యాఖ్యలపైన తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యే ఎవరన్నది పార్టీ హైకమాండ్​ డిసైడ్​ చేస్తదని ఇరువర్గాలు చెప్తున్నప్పటికీ, మండల కమిటీ నియామకాల్లో కృష్ణారెడ్డి వర్గానికే ప్రయారిటీ ఇవ్వడంతో ఇరువర్గాల మధ్య గొడవ రాజుకుంది. కమిటీల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అర్థంగాక కొత్త, పాత లీడర్లు నియోజకవర్గంలో తలలు పట్టుకుంటున్నారు. 

నకిరేకల్​ కాంగ్రెస్​లో..

నకిరేకల్​ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో కొత్తగా నియమించిన మండ ల పార్టీ అధ్యక్షులపై ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి పార్టీ హైకమాండ్​కు  ఫిర్యాదు చేయడంతో వాటిని రద్దు చేశారు. తిరిగి వెంకటరెడ్డి వర్గానికి చెందిన కేడర్​ను పార్టీ అధ్యక్షులుగా నియమించారు. దీన్ని సీరియస్​గా తీసుకున్న పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ వాటిని రద్దు చేశారు. ఇరువర్గాల మధ్య వివాదం ముదిరిపోవడంతో గురువారం నకిరేకల్​లో రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసినం దుకు నిరసనగా మల్లయ్య దీక్ష చేపట్టారు. ఈ ప్రోగామ్​కు కోమటిరెడ్డి వ్యతిరేక శక్తులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, చెరుకు సుధాకర్​తోపాటు, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంక ర్​నాయక్, భువనగిరి పార్లమెంట్ ఇన్ చార్జి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య హాజరయ్యారు.

ఈ సభలో బాహాటంగానే వెంకటరె డ్డి పైన, పార్టీ మారిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పైన నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల వరకు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కావాలంటే పనిచేసే నాయకులకే మండల, గ్రామ కమిటీల్లో ప్రాధాన్యం కల్పించాలని, లేకపోతే పార్టీ నిండా మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓవైపు మీటింగ్ జరుగుతుం డగానే మరోవైపు ఎంపీ వెంకటరెడ్డి అక్కడ ఉన్న పార్టీ ముఖ్య నాయకులకు ఫోన్ చేసి మీటింగ్ గురించి ఆరా తీయడం గమనార్హం.