- సిట్టింగ్‌లకే టికెట్ కన్ఫామ్ చేస్తున్న హైకమాండ్
- పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న అసంతృప్త లీడర్లు
- ఎమ్మెల్యే కిషోర్‌కు మళ్లీ ఛాన్స్ ఇస్తామనడంతో మందుల సామేలు రిజైన్
- నల్గొండ, మునుగోడు, నకిరేకల్, కోదాడలోనూ రాజుకున్న వేడి
- మరో నాలుగు సెగ్మెంట్లలో అసంతృప్తుల కదలికలపై పార్టీలో చర్చ
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బీఆర్‌ఎస్ ఆశావహుల్లో టెన్షన్మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లను మారుస్తారని ప్రచారం జరిగినా.. హైకమాండ్ సిట్టింగులకే మళ్లీ అవకాశాలు ఇస్తోంది. దీంతో ఎమ్మెల్యేలను మారిస్తే ఛాన్స్ తమదేనని ధీమాతో ఉన్న పలువురు అసంతృప్త లీడర్లు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం తిరుమలగిరి ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ తుంగతుర్తి క్యాండిడేట్ గాదరి కిషోర్ కుమార్ పేరు అనౌన్స్ చేయడంతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు శుక్రవారం పార్టీకి రాజీనామా చేయడం చర్చకు దారి తీసింది. ఇదే నియోజకవర్గంలో తనకే టికెట్ అని ప్రచారం చేసుకున్న మహిళా ప్రభుత్వ అధికారి జ్యోతి పద్మ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.
ఉమ్మడి జిల్లా మొత్తం సిట్టింగులకే!
తుంగతుర్తి సీటు కిషోర్‌దేనని పబ్లిక్ మీటింగ్‌లో అనౌన్స్ చేయడంతో ఉమ్మడి జిల్లా అంతా దాదాపు ఇదే పరిస్థితి ఉండొచ్చని రూలింగ్ పార్టీ లీడర్లు భావిస్తున్నారు. గతంలో హుజూర్నగర్, మిర్యాలగూడ సీట్లు సిట్టింగ్‌లకే డిసైడ్ చేశారు. ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, భాస్కర్రావులే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని కేటీఆర్, హారీశ్‌రావు ఇప్పటికే ప్రకటించారు. దీంతో మిర్యాలగూడలో కమ్యూనిస్టులకు అవకాశం లేదని చెప్పకనే చెప్పారు. ఇక హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డి బెర్త్ కనఫర్మ్ చేయడంతో అక్కడ అసంతృప్తులకు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో 12 స్థానాల్లో మూడు సీట్లు సిట్టింగ్‌లకు కన్ఫార్మ్ అయినట్లే. మిగిలిన 9 స్థానాల్లో మంత్రి జగదీశ్ రెడ్డి సొంత నియోజకవర్గం సూర్యా పేట మినహాయిస్తే 8 సీట్ల పైన చర్చ జరుగుతోంది. ఆలేరు, భువనగిరి, కో దాడ, నాగార్జునసాగర్, మునుగోడు, నల్గొండ, దేవరకొండ, నకిరేకల్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది.
ఆశావహులకు చెక్ పడినట్లే...
ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు నుంచే అభ్యర్థులను డిసైడ్ చేయడంపై ఎమ్మెల్యేలు సంతోష పడుతుంటే... అసంతృప్తులు మా త్రం టెన్షన్ పడుతున్నారు. అందుకే వీలైనంత త్వరగా కేసీఆర్, కేటీఆర్‌లను తమ నియోజకవర్గాలకు రప్పించుకుని తమ పేర్లు ప్రకటించుకోవాలని ఆరాట పడుతున్నారు. ఈ జాబితాలో ముందుగా నకిరేకల్, నల్గొండ, కోదాడ, మునుగోడు ఎమ్మెల్యేలు ఉన్నారు.
నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వ్యవహారం హైకమాండ్‌కు పెద్ద పరీక్షగా మారింది. వీరేశం పార్టీ మారితే ప్రభావం ఎలా ఉంటుందని ఇంటిలిజెన్స్వర్గాలు సర్వే చేశాయి. వీరేశం ఎఫెక్ట్ నకిరేకల్, తుంగతుర్తితో పాటు సూర్యాపేట బెల్ట్‌లో కూడా ఉంటుందని హైకమాండ్‌కు రిపోర్ట్ పంపినట్లు తెలిసింది. అందుకే ఇంతకాలం మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌కు దూరంగా ఉన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం ఆయన బర్త్‌డే వేడుకల్లో ప్రత్యక్షమయ్యారు. హైకమాండ్సంకేతాల మేరకే చిరుమర్తి స్టాండ్ మార్చినట్లు ప్రచారం జరుగుతోంది.
నల్గొండలో పిల్లి రామరాజు యాదవ్‌తో సహా, పలువురు కౌన్సిలర్లు, మండల నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి బొమ్మలతో రామరాజు ప్రచారం చేసుకోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. మంత్రి బుజ్జగించినా రామరాజు దూకూడు మాత్రం తగ్గలేదు.
కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు టికెట్ ఇస్తే పనిచేసే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, కన్మంత శశిధర్ రెడ్డితో సహా పలువురు సీనియర్లు ఇప్పటికే తేల్చి చెప్పారు. కోదాడ టికెట్ కచ్చితంగా మారుస్తారని, అదే జరిగితే తమకే అవకాశం వస్తదని వారంతా వెయిట్ చేస్తున్నారు.
మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, చైర్మన్లు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అసంతృప్తితో ఉన్నారు. హైకమాండ్ మాటకు కట్టుబడి బైపోల్‌లో ప్రభాకర్ రెడ్డిని గెలిపించామే తప్ప వచ్చే ఎన్నికల్లో అలా చేయడం సాధ్యం కాదని బాహాటంగానే చెబుతున్నారు.
ఆలేరులో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఎమ్మెల్యే టికెట్ ఖాయమని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌కు వ్యతిరేకంగా ఓ గ్రూపు పనిచేస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గానికి ఎమ్మెల్యేకు అస్సలు పడట్లేదు. ఆలంపల్లి నర్సింహా, వడ్త్యా దేవేందర్, దేవేందర్‌రావు లాంటి సీనియర్ లీడర్లు ఎమ్మెల్యే తీరుపై గుర్రుగా ఉన్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన భగత్ఒంటిరిగానే సాగర్‌లో ఎదురీదుతున్నారు. తండ్రి నర్సింహయ్య మరణంతో భగత్‌కు బైపోల్‌లో ఎమ్మెల్యే అవకాశం రాగా.. ఈసారి మాత్రం రెడ్డి వర్గానికే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.