- ఎకరాకు 8 నుంచి 6క్వింటాళ్లకు పడిపోయిన దిగుబడి
- రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు పలుకుతున్న క్వింటాల్ పత్తి
- ఇంకా ధర పెరిగే అవకాశం ఉండడంతో పత్తిని నిల్వ చేస్తున్న రైతులు
నల్గొండ, వెలుగు: అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులకు ధర రూపంలో కాస్త ఊరట లభిస్తోంది. ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులకు ఈ సీజన్‌లో అనుకున్నంత దిగుబడి రాకపోయినప్పటికీ మార్కెట్‌లో పత్తికి మంచి రేటు పలుకుతుండడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ధర రాబోయే రోజుల్లో మరింత పెరిగే చాన్స్ ఉండొచ్చని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.
గతేడాది కూడా పత్తి ఏరడం చివరి దశకు చేరుకున్న టైంలో రేటు పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి రైతులు జాగ్రత్త పడుతున్నారు. ఒకే సారి ఏరకుండా, చెట్లపైనే పత్తి వాడిపోకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అక్కడకక్కడ వర్షాలు వస్తాయనుకుంటున్న ప్రాంతాల్లో మాత్రం పత్తి నిల్వ చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
గత నెల నుంచి పత్తి మార్కెట్లోకి రావడం ప్రారంభమైంది. అయితే నవంబర్, డిసెంబర్‌లోనే పత్తి ఎక్కువగా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉండడంతో మంచిరేటు వస్తదనే ఆలోచనలో రైతులు ఉన్నారు. దళారులు రంగ ప్రవేశం చేసినప్పటికీ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలకు పత్తి తరలించేందుకు కూడా రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అకాల వర్షాలతో తగ్గిన దిగుబడి
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 9.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలోనే 6.45 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, సూర్యాపేటలో 2.25 లక్షలు, యాదాద్రి జిల్లాలో 75 వేల ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ సీజన్ ప్రారంభంలో వర్షాలు పడక కొంత నష్టం జరిగితే.. పత్తి గింజలు నాటి, మొలకెత్తిన టైంలో భారీ వర్షాలు పడ్డాయి.
దీంతో చాలా చోట్ల పత్తి ఎర్రబారింది. దీంతో ప్రస్తుతం ఎకరాకు ఆరేడు క్వింటాళ్లకు మించి రావడం లేదని ఆఫీసర్లు చెపుతున్నారు. ఆయకట్టు ఏరియాలో కొన్ని చోట్ల మాత్రం 8, 9 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడి వస్తోంది. నల్గొండ జిల్లాలోనే పత్తికి భారీ నష్టం వాటిల్లింది. 6.45 లక్షల ఎకరాల్లో పంట సాగు చేయగా, సుమారు 50 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ మార్కెట్లోకి వస్తున్న పంటను పరిశీలిస్తే మొత్తం దిగుబడి 25 లక్షల నుంచి 30 లక్షల క్వింటాళ్లకు మించకపోవచ్చని చెపుతున్నారు.
మార్కెట్లోకి వచ్చింది 1.50 లక్షల క్వింటాళ్లే...
మొదటి దశలో వచ్చిన పత్తి కంటే నవంబర్, డిసెంబర్‌లో వచ్చే పత్తికే ఎక్కువ డిమాండ్ ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఫస్ట్ పికింగ్‌లో పత్తి నాణ్యత ఉండకపోవడంతో అంత రేటు పలకదని, కానీ ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న పత్తికి మంచి డిమాండ్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం క్వింటాల్ పత్తి రూ.8 వేల నుంచి రూ.10 వేలు పలుకుతోంది.
డిసెంబర్ చివరి నాటికి ఈ రేట్ మరింత పెరిగే అవకాశాలు ఉండొచ్చని కూడా చెబుతుండడంతో రైతులు పత్తిని నిల్వ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో మార్కెట్లోకి వచ్చిన పత్తి కేవలం 1.50 లక్షల క్వింటాళ్లు మాత్రమే. గతేడాది మార్కెట్లోకి పత్తి అంతా తరలించాక, రేట్ అమాంతం పెంచారు. దీంతో రైతులు నష్టపోయారు. కానీ ఈ సీజన్ ప్రారంభంలోనే రేటు పలుకుతుండటంతో రైతులు జాగ్రత్త పడుతున్నారు.
తెరచుకోని సీసీఐ సెంటర్లు
కేంద్రం ప్రకటించిన మద్ధతు ధర కంటే మార్కెట్లో పత్తికి రేటు ఎక్కువగా ఉండటంతో సీసీఐ సెంటర్లు ఓపెన్ చేయలేదు. మద్దతు ధర రూ. 6,100 నుంచి రూ.6,380 వరకు ఉంది. మద్ధతు ధరకు మించి 2, 3 వేలు ఎక్కువగా వస్తుండడంతో సెంటర్లు ఓపెన్ చేయలేదని మార్కెటింగ్ ఏడీ శ్రీకాంత్ తెలిపారు. రైతులు దళారుల బారిన పడి నష్టపోవద్దని మార్కెట్లో మంచి రేటు పలుకుతోందన్నారు.