నల్గొండ జిల్లాలో జోరందుకున్న సాగు .. గతేడాదితో పోలిస్తే పెరిగిన వర్షపాతం 

  • మూడు రోజులుగా కురుస్తున్న వానలు
  • వరినార్లు పోస్తున్న రైతులు, పత్తికి ప్రాణం
  • 20 మండలాల్లో అధికం, 11 మండలాల్లో సాధారణం
  • చిట్యాల మండలంలోనే అత్యల్ప వర్షపాతం

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. ఆయకట్టు, నాన్​ ఆయకట్టు పరిధిలో ఈ సీజన్​లో వర్షపాతం పెరిగింది. జూన్​లో నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా వానలు బాగా పడ్డాయి. ఇప్పుడు అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత కొద్దిరోజులుగా వానలు కురుస్తున్నాయి. కుండపోత లేనప్పటికీ జూన్​ 1 నుంచి జులై 16 వరకు జిల్లాలో 146.8 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 195.2 మి.మీ. పడింది. అంటే సాధారణానికి మించి 33 మి.మీలు అత్యధికంగా కురిసింది. ఫలితంగా జిల్లాలోని రైతులు వరినార్లు పోసుకుంటున్నారు. ఇప్పటివరకు కురిసిన వానలు పత్తికి ప్రాణం పోశాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

తొలుత ఆందోళన పడ్డ రైతులు

నాగార్జునసాగర్, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు రిజర్వాయర్లలో ఇటీవల నీటి నిల్వలు అడుగంటిపోవడంతో రైతులు కలవరపడ్డారు. అల్పపీడన ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో వానలు పడడంతోపాటు ఈ ప్రభావం సెప్టెంబర్​ వరకు కొనసాగుతుందని అధికారులు చెబుతుండడంతో రైతుల బోరు బావుల కింద పంటలు సాగుచేస్తున్నారు. ఎగువన ఆల్మట్టి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పెరుగుతుండటంతో జూన్​ నెలాఖరు నుంచి పంటల సాగు క్రమంగా పెరుగుతోంది.

వరితో పోలిస్తే పత్తి గణనీయం

ఈ సీజన్​లో అన్ని కలిపి11 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా అధికారులు వేశారు. ప్రధానంగా వరి 5 లక్షల ఎకరాలు సాగవుతుందని అంచనా.  అయితే, వరితో పోలిస్తే పత్తి సాగు గణనీయంగా పెరిగింది. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ఆసక్తి చూపడం లేదు. కేవలం జీలుగు మాత్రమే ఆరు వేల ఎకరాల్లో పండించారు. ఇప్పటివరకు 15,658 ఎకరాలు మాత్రమే వరి సాగు కాగా, మరో 2 లక్షల ఎకరాల్లో నార్లు పోసుకున్నా రు. జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పత్తి సాగు 5.60 లక్షల ఎకరాలకు గాను 3,46,790 ఎకరాలు సాగైంది. 

నీలగిరి సాధారణానికి మించి తడిసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతం పెరిగింది. జిల్లాలోని 32 మండలాలకు గాను 20 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మరో 11 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. ఒక్క చిట్యాల మండలంపైనే వరుణుడి కరుణించలేదు. 
వర్షపాతం 

నమోదైన మండలాలివే...

నార్కట్​పల్లి, నకిరేకల్, నల్గొండ, కనగల్, త్రిపురా రం, మాడ్గులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ, అడవిదేవుపల్లి, నేరేడుగొ మ్ము, డిండి మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కట్టంగూరు, శాలిగౌరారం, కేతేపల్లి, తిప్పర్తి, అనుమల, నిడమనూరు, దామరచర్ల, పెద్దవూర, తిరుమలగిరి సాగర్​, చింతపల్లి, గుర్రంపోడు, పీఏపల్లి, కొండమల్లే పల్లి, దేవరకొండ, చందంపేట, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి మండలా ల్లో సాధారణానికి మించి వర్షం పడింది.