నల్గొండ, వెలుగు : రుణమాఫీలో నల్గొండ జిల్లా స్టేట్‌లోనే అగ్రస్థానంలో నిలిచిందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్గొండలో జరిగిన రుణమాఫీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ట్రాక్టర్నడుపుతూ ఐదు కిలీమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఒకేసారి రూ.31 వేల కోట్ల మేరకు రెండు లక్షలలోపు రైతుల పంట రుణమాపీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. జిల్లాలో 83,121 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 78,757 కుటుంబాలకు రుణమాఫీ కింద రూ.481.63 కోట్లు రిలీజ్చేశామన్నారు.
రుణమాఫీకి సంబంధించి రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోయినా, లేదా ఎవరైనా బ్యాంకరు పాత బాకీ కింద జమ చేసుకున్న నేరుగా తనకు గాని, జిల్లా కలెక్టర్ కు గాని ఫోన్ చేయవచ్చని మంత్రి సూచించారు. మరో వారం రోజుల్లో లక్షన్నర లోపు రుణాలు మాఫీ అవుతాయని, ఆ తర్వాత వారంలో రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని వివరించారు. ఆగస్టు చివరినాటికి రూ.2 లక్షలలోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని స్పష్టం చేశారు
గ్రీన్ చానల్ ద్వారా ప్రాజెక్టులకు నిధులు..
ఎస్ఎల్ బీసీ సొరంగం, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తి కోసం గ్రీన్ ఛానల్ లో నిధులను పెట్టించి 26 నెలల్లో పనులు పూర్తిచేసేలా సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన, తరగతి గదుల నిర్మాణం వంటి వాటికి రూ.60 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పంట రుణాల మాఫీలో భాగంగా లక్ష రూపాయలలోపు రుణాలు ఉన్న రైతులందరికీ ఈరోజే వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతాయని తెలిపారు.
ఈ విషయమై గురువారం ఉదయమే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించామని చెప్పారు. లక్ష వరకు రుణమాఫీ ఖాతాల్లో జమ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో రైతు రుణమాఫీ నిధులను ఇతర లోన్ల కింద పట్టుకోవద్దని స్పష్టం చేశామని వివరించారు. ఏదైనా సమస్యతో రైతుల ఖాతాల్లో నిధులు జమ కానట్లయితే జిల్లా స్థాయిలో ఐదుమంది అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, 7288800023 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్, అధికారులు పాల్గొన్నారు.