రూ.లక్ష రుణమాఫీలో నల్గొండ టాప్​

రూ.లక్ష రుణమాఫీలో నల్గొండ టాప్​
  • ఈ ఒక్క జిల్లాలోనే  రూ.454.49 కోట్లు మాఫీ
  • రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు 11,50,193 మంది రైతులకు లబ్ధి
  • వారి ఖాతాల్లో 6 వేల 98 కోట్ల 93 లక్షలు జమ

హైద‌‌రాబాద్‌‌, వెలుగు : రూ.ల‌‌క్ష రుణ‌‌మాఫీలో నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే మొద‌‌టిస్థానంలో నిలిచింది. రూ.2 లక్షల పంట రుణమాఫీలో భాగంగా తొలి విడతలో గురువారం రూ. లక్ష వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఇందులో రాష్ట్రవ్యాప్తం గా తొలిరోజు 10,84,050 రైతు కుటుంబాల‌‌కు చెందిన 11,50,193 మంది రైతుల రుణ ఖాతాల్లో రూ.6,098.93 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జ‌‌మ చేసింది. దీంతో ఆ కుటుంబాల‌‌న్నీ రుణ‌‌విముక్తి పొందాయి.

రూ.లక్ష రుణ‌‌మాఫీ జ‌‌రిగిన 32 జిల్లాల్లో నల్గొండ టాప్​లో నిలిచింది. ఈ ఒక్క జిల్లాలోనే 78,463 రైతు కుటుంబాలకు చెందిన 83,124  రైతుల క్రాప్​లోన్లు రూ. 454.49 కోట్ల మాఫీ అయ్యాయి. ఆ తర్వాత సిద్ది పేట జిల్లాలో రూ.290.24 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ. 282.98కోట్లు, సంగారెడ్డి జిల్లాలో రూ. 279.62కోట్లు, నాగర్​ కర్నూల్​ జిల్లాలో రూ. 270.04 కోట్లు మాఫీ అయ్యి టాప్​ ఫైవ్​ జిల్లాల్లో నిలిచాయి. చివరి స్థానంలో మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 2,667 రైతు కుటుంబాలకు చెందిన 2,781  మంది రైతుల క్రాప్​లోన్​  రూ.12.23 కోట్లు మాఫీ అయింది. 

నియోజకవర్గాల్లో ఆందోల్​దే ఫస్ట్​ ప్లేస్​రూ.ల‌‌క్ష రుణ‌‌మాఫీలో రాష్ట్రంలో మొద‌‌టి స్థానం లో ఆందోల్ అసెంబ్లీ నియోజ‌‌క‌‌వ‌‌ర్గం నిలిచింది. ఆ త‌‌ర్వాత స్థానాల్లో హుస్నాబాద్‌‌, క‌‌ల్వకుర్తి నియోజకవర్గాలు రెండు, మూడు స్థానాలు ద‌‌క్కించుకున్నాయి. మొత్తం119 అసెంబ్లీ నియోజ‌‌క‌‌వ‌‌ర్గాల్లోని  9 న‌‌గ‌‌ర నియోజ‌‌క‌‌వ‌‌ర్గాల్లో రైతు రుణాలు లేవు. రుణ‌‌మాఫీ జ‌‌రిగిన 110 నియోజ‌‌క‌‌వ‌‌ర్గాల్లో అత్యధికంగా ఆందోల్ నియోజ‌‌క‌‌వ‌‌ర్గంలో 19,186 రైతు కుటుంబాల‌‌కు చెందిన 20,216 మంది రైతుల‌‌

రూ.107.83 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. త‌‌ర్వాత హుస్నాబాద్ నియోజ‌‌క‌‌వ‌‌ర్గంలో 18,101 రైతు కుటుంబాల‌‌కు చెందిన 18,907 మంది రైతుల‌‌ రూ.106.74 కోట్లు,  క‌‌ల్వకుర్తి నియోజ‌‌క‌‌వ‌‌ర్గంలో 17,270 రైతు కుటుంబాల‌‌కు చెందిన 18,196 మంది రైతుల‌‌ రూ.103.02 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. లక్ష రూపాయలలోపు మాఫీ అయిన నియోజకవర్గాల్లో అత్యల్పంగా మల్కాజ్​గిరిలో ఒక్కరికే అదీ రూ. 50,370 మాఫీ అయింది.