కనగల్ ఎస్ఐ అంతిరెడ్డిపై బదిలీ వేటు.. అవినీతి ఆరోపణలే అసలు కారణమా..?

నల్లగొండ జిల్లా కనగల్ ఎస్ఐ అంతిరెడ్డిపై బదిలీ వేటు పడింది. పోలీసు ఉన్నతాధికారులు అంతిరెడ్డిని ట్రాన్స్ ఫర్ చేశారు. ఇసుక అక్రమ రవాణాలో ఎస్ఐ అంతిరెడ్డి చేతివాటంపై జిల్లా ఎస్పీ అపూర్వరావుకు చాలామంది ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదులతో ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేపట్టడంతో అసలు నిజాలు తెలిశాయి.

ఇసుక అక్రమ రవాణాలో ఎస్ఐ అంతిరెడ్డి చేతివాటం ప్రదర్శించారని నిజాలు తేలడంతో ఆయనపై వేటు పడింది. అంతిరెడ్డిని వీఆర్కు అటాచ్ చేస్తూ.. జిల్లా ఎస్పీ అపూర్వరావు ఉత్తర్వులు జారీ చేశారు. దేవరకొండ బందోబస్తులో ఎస్ఐ అంతిరెడ్డి ఉండగానే కనగల్ కు కొత్త ఎస్ఐ వచ్చారు. కనగల్ ఎస్ఐగా రామకృష్ణ బాధ్యతలు తీసుకున్నారు. 

మరోవైపు.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొన్నటివరకు ఎన్నికల్లో వన్ సైడ్ పని చేసిన పోలీస్ అధికారులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫోకస్ పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది పోలీసు అధికారులు నాయకుల చుట్టు తిరుగుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పోస్టింగులు కాపాడుకోవడం కోసం పైరవీలు మొదలుపెట్టారని ప్రచారం జరుగుతోంది. 

తప్పు చేస్తే కఠిన చర్యలు : జిల్లా ఎస్పీ

సివిల్ మ్యాటర్ లో జోక్యం చేసుకున్నా.. ఎవరైనా అక్రమాలు చేసినట్లు ఫిర్యాదుల వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలన్నారు. పోలీసులపై ఎలాంటి అవినీతి, ఆరోపణలు వచ్చినా విచారణ చేస్తామని తెలిపారు. ఒకవేళ తప్పు చేశారని తెలిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.