మత్తు వదలట్లే !.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీ- అడిక్షన్ సెంటర్ కోసం ఎదురుచూపులు

 మత్తు వదలట్లే !.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీ- అడిక్షన్ సెంటర్ కోసం ఎదురుచూపులు
  • గతంలో ప్రతిపాదనలు పంపినా అమలు కాలే
  • డ్రగ్స్, గంజాయి, మద్యానికి బానిసలు అవుతున్న యువత 

నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీ–అడిక్షన్ సెంటర్ లేక యువత భవిష్యత్ చిత్తవుతుంది. మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మత్తు నుంచి బయటపడేందుకు అవసరమైన వైద్య సహాయం, కౌన్సెలింగ్ ఇచ్చి పూర్తి ఆరోగ్యవంతులుగా మార్చే శక్తి డీ– అడిక్షన్ సెంటర్లకు ఉంటుంది. 

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిక శాఖ ఆధ్యర్యంలో నేషనల్ యాక్షన్ ఫర్ డ్రగ్స్ డిమాండ్ రిడక్షన్ పథకం కింద ప్రభుత్వ హాస్పిటల్స్​లో డీ–అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తారు. అయితే జిల్లాలో ఎక్కువగా యువత గంజాయికి బానిస అవుతుండడంతో అధికారులు మూడేండ్ల కిందట ప్రతిపాదనలు పెట్టినా నేటికీ డీ–అడిక్షన్​సెంటర్ ఉమ్మడి జిల్లాకు మంజూరు కాలేదు.  

డ్రగ్స్, మద్యానికి బానిసలు అవుతున్న యువత.. 

గత పదేండ్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి వ్యాపారం సాగింది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం భారీగా గంజాయి దొరుకుతుండడంతో యువత మత్తులో తూగుతున్నారు. మొదట్లో రోజువారి కూలీ పనులు చేసే వారిలో ఈ వ్యసనం ఉండేంది. ఇది క్రమంగా కాలేజీ స్టూడెంట్స్ సైతం పాకింది. దీంతో గ్రామాల్లో గంజాయి మత్తులో యువకులు గొడవలకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. అయితే గతంలో దీనిని అరికట్టాల్సిన పోలీసులు, నాయకుల ఒత్తిడితో చూసీచూడనట్లు వదిలేయడంతో జిల్లాలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. 

కౌన్సెలింగ్ లకే పరిమితం..

ఇటీవల గంజాయి రవాణాకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఎక్కడికక్కడే తనిఖీలు చేస్తూ గంజాయి రవాణా కాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే గంజాయికి అలవాటు పడిన బాధితులు చిన్నచిన్న ప్యాకెట్లను దొరకడంతో వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు వేల సంఖ్యలో యువత రెగ్యులర్ గా గంజాయి తాగుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. బాధితులకు పలుమార్లు పోలీసులు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నా తీరు మారకపోవడంతో కేసులు 
నమోదు చేస్తున్నారు. 

మత్తు వదలాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిందే.. 

గంజాయి, డ్రగ్స్ బారిన పడుతున్న వారికి డీ–అడిక్షన్ సెంటర్ లో ట్రీట్మెంట్ అందిస్తే తిరిగి పూర్తిగా కోలుకునే  అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ల సమక్షంలో ట్రీట్మెంట్ అందిస్తూ కౌన్సెలింగ్ ఇవ్వడంతో వారిలో మార్పు వచ్చే చాన్స్ ఉంది. పూర్తి ఆరోగ్యవంతులుగా మరేందుకు దాదాపు 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీ–అడిక్షన్ సెంటర్ లేకపోవడంతో హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆ దిశగా మాత్రం చర్యలు చేపట్ట లేదు. దీంతో  బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సూర్యాపేట, నల్గొండ జిల్లాల ఎస్పీలు గతంలో డీ –అడిక్షన్ సెంటర్ ను ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు.

ప్రతిపాదనలు పంపించాం  

 జిల్లాలో డీ–అడిక్షన్ సెంటర్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఏర్పాటు చేస్తాం. యువత డ్రగ్స్, మద్యానికి బానిసలు కావొద్దు. డ్రగ్స్​నుంచి యువతను కాపాడుతాం. ఎస్పీ నరసింహ, సూర్యాపేట జిల్లా