- చనిపోయేముందు సోదరుడికి శివాని కాల్
- బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పిన మృతురాలు
- అదుపులో ఇద్దరు యువకులు?
- మొబైల్ అనాలసిస్ తర్వాతే తేలుతుందన్న పోలీసులు
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న నార్కట్ పల్లి మండలం అమ్మనబోలుకు చెందిన ఎనగతుల మనీషా (20), నక్కలపల్లికి చెందిన దంతరబోయిన శివాని (20)ల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అంత్యక్రియల తర్వాత శివానికి సోదరుడి వరుసయ్యే ఓ యువకుడు గడ్డి మందు తాగాక శివాని తనతో మాట్లాడిందంటూ ఓ ఆడియో రిలీజ్ చేశాడు. అందులో శివానీ మాట్లాడుతూ ‘ కొందరు తమ ఇన్‌స్టా నుంచి డీపీ తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్నా.. ’ అని అన్నట్టు ఉంది. ఈ ఆడియో వైరల్ కావడంతో పోలీసులు దాని ఆధారంగా దర్యాప్తు స్పీడప్ చేశారు.
అయితే, అంత్యక్రియల వరకు ఆగి తర్వాత ఆడియోను బయటపెట్టడంతో పోలీసులు సదరు యువకుడితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. ఈ కేసులో మరో నలుగురుయువకులను కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మనీషా, శివాని చికిత్స పొందుతున్న సమయంలోనూ జడ్జికి, పోలీసులకు తమ ఫొటోలు మార్ఫింగ్చేసి బ్లాక్మెయిల్ చేశారని చెప్పడంతో వారిద్దరి సెల్ఫోన్లను సైబర్ క్రైంకు అనాలసిస్ కోసం పంపించారు. మృతుల వాంగ్మూలమే తప్ప ఇప్పటి వరకూ ఫొటోల మార్ఫింగ్‌పై తమకు ఆధారాలు దొరకలేదని పోలీసులంటున్నారు.