మునుగోడు బై ఎలక్షన్‌కు రెడీ
ఏర్పాట్లలో నిమగ్నమైన నల్గొండ, యాదాద్రి జిల్లాల అధికారులు
నల్గొండ, వెలుగు : మునుగోడు బైఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్కావడంతో నల్గొండ, యాదాద్రి జిల్లాల అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నల్గొండ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, యాదాద్రి కలెక్టర్ పమేల సత్పతి, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ నారాయణపూర్, చౌటుప్పల్ పోలీస్స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలపై ఫోకస్‌పెట్టారు. ఉప ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌గా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ రిటర్నింగ్ఆఫీసర్గా నల్గొండ ఆర్డీవో జగన్నాథం వ్యవహరించనున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు ఈవీఎం మిషన్ల పరిశీలన పూర్తిచేశారు. నియోజకవర్గంలో ఎన్నికల సామగ్రిని చండూరు మండల కేంద్రంలో పంపిణీ చేయనున్నారు. నవంబర్ 3 పోలింగ్ ముగియగానే ఈవీఎం మిషన్లను నల్గొండలోని ఆర్జాలబావి ఎఫ్‌సీఐ గోదాంలో భద్రపరుస్తామని ఆఫీసర్లు తెలిపారు. 6వ తేదీన ఓట్ల లెక్కింపు కూడా అక్కడే జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మునుగోడులో తాజా లెక్కల ప్రకారం మొత్తం ఓటర్లు 2.27 లక్షల మంది ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరి 1న రిలీజ్ చేసిన ఓటరు జాబితానే ప్రామాణికంగా తీసుకుంటారు. తాజా ఓటర్లు నియోజకవర్గంలో పురుషులు 1,15,62 3 మంది ఉండగా, మహిళలు 1,11,637, ఇతరులు 5 గురు ఉన్నారు. 2 98 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.
దసరా తెల్లారి నుంచే మునుగోడు బాట పట్టనున్న నేతలు..
దసరా పండుగ తర్వాత ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచార రథాలు నియోజకవర్గంలో తిరుగుతున్నాయి. అభ్యర్థుల ప్రచార రథాలు కూడా సిద్ధం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాయి. అ భ్యర్థుల విషయానికొస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును ప్రకటించగా.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పేరును 5,6 తేదీల్లో ప్రకటిస్తారని తెలిసింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును దసరా రోజున ప్రకటిస్తారని సమాచారం. దసరా ముందుగానే అభ్యర్థులను డిసైడ్ చేసి తెల్లారి నుంచే ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. ప్రతి వంద మంది ఓటర్లకు టీఆర్ఎస్ ఒక బాధ్యుడిని నియమించింది. బీజేపీ ఇన్చార్జిలు, బూత్ఇన్చార్జిలు కూడా ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లేలా ఎన్నికల వ్యూహాం రూపొందించారు.ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బూత్ ఇన్చార్జిలు, ఆ పార్టీ ముఖ్య నేతల పలు మీటింగ్‌లు పెట్టారు. దసరా తెల్లారి నుంచి పూర్తిస్థాయి కార్యాచరణ అమలు చేసేందుకు ప్లాన్ చేశారు.
ప్రజావాణిలో బాధితులకు రశీదులు ఇవ్వాలి
కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట, వెలుగు: ప్రజావాణిలో వచ్చే అర్జీలకు ఆఫీసర్లు తప్పనిసరిగా రశీదులను ఇవ్వాలని కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అడిషనల్కలెక్టర్ మోహన్ రావుతో కలిసి అర్జీలను తీసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పెన్షన్లు, భూ సంబంధిత సమస్యలు, కళాకారుల పెన్షనలను అక్కడికక్కడే పరిష్కరించినట్లు చెప్పారు. మొత్తం 32అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజావాణికి హాజరు కాని ఆఫీసర్లకు మెమోలు జారీ చేసి ఎందుకు రాలేదో వివరణ తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. అనంతరం సివిల్ సప్లై గోడౌన్స్ లో పని చేస్తున్న 173 మంది హమాలీలకు దసరా బోనస్‌గా ఒక్కొక్కరికి రూ.6,200, దుస్తులను పంపిణీ చేశారు. సూర్యాపేట ఆర్డీవో రాజేంద్ర కుమార్, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జడ్పీ సీఈవో సురేశ్, సీపీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ
చౌటుప్పల్, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం పోలీస్స్టేషన్లను రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ సోమవారం తనిఖీ చేశారు. మునుగోడు బైఎలక్షన్నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఎన్నికల విధులను నిర్వహించే విధానంపై పోలీస్ ఆఫీసర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు. ఆయన వెంట భువనగిరి డీసీపీ కె.నారాయణ రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్ రెడ్డి, సీఐ మహేశ్, ఎస్సై యుగేందర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.
మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం
చౌటుప్పల్, వెలుగు: మునుగోడు బై ఎలక్షన్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని చౌటుప్పల్మున్సిపాలిటీ సహ ఇన్చార్జిలు సుభాష్ చందర్ జీ, కర్నాటి ధనుంజయ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్ తెలిపారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం, తాళ్లసింగారం, లింగారెడ్డిగూడెం, లలో ఇంటింటికి తిరిగి ఓటర్ల లిస్టులను చెక్‌చేశారు. టీఆర్ఎస్ఉప ఎన్నికల్లో గెలవడానికి కొత్తగా దొంగ ఓట్లను రెడీ చేశారని, అందుకే ప్రతి బూత్లెవల్ఇన్చార్జి ఓటర్‌లిస్టును పరిశీలించాలని కోరారు. బూత్ లెవల్ప్రెసిడెంట్కడారి ఐలయ్య, ఊదరి రంగయ్య, పిల్ల బుచ్చయ్య, పెద్దగోని జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
బ్రిడ్జి కట్టాలని శవంతో రాస్తారోకో
పెద్దబావికుంటలో దొరికిన సైదులు డెడ్‌బాడీ
ఆర్డీఓ హామీతో ఆందోళన విరమణ
మునగాల, వెలుగు : రెండు రోజుల కింద సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గురప్ప వాగులో కొట్టుకుపోయిన డెడ్ బాడీ సోమవారం దొరికింది. అయితే బ్రిడ్జి లేకపోవడం వల్లే సైదులు చనిపోయాడని, అతడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు, అఖిలపక్ష నాయకులు మృతదేహంతో ఆందోళన చేశారు. గ్రామానికి చెందిన షేక్ సైదులు (33) కొంతకాలంగా చిలుకూరు మండలం బేతవోలులో ఉంటున్నాడు. శనివారం తాడ్వాయిలో ఉన్న తన తల్లి దగ్గరకు వస్తూ వాగులో కొట్టుకుపోయాడు. అప్పటినుంచి అతడి కోసం వెతుకుతుండగా సోమవారం ఉదయం వాగు లోపల భాగంలో ఉన్న పెద్ద బావికుంటలో మృతదేహం కనిపించింది.
శవంతో రాస్తారోకో
మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని అఖిలపక్ష పార్టీల లీడర్లు, గ్రామస్తులు డెడ్‌బాడీతో వాగు వద్ద రాస్తారోకో చేశారు. సూర్యాపేట కలెక్టర్, కోదాడ ఎమ్మెల్యే వచ్చి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. మునగాల సీఐ ఆంజనేయులు, ఎస్సై బాలు నాయక్ వచ్చి బతిమిలాడినా వినలేదు. విషయాన్ని కోదాడ ఆర్డీఓ కిశోర్ కుమార్ చెప్పగా ఆయన ఫోన్లో మాట్లాడారు. వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని, మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు.
సర్కార్ స్కూళ్లను పట్టించుకోని ప్రభుత్వం
హుజూర్ నగర్ , వెలుగు: ప్రభుత్వం అవలంబిస్తున్న అశాస్త్రీయ విధానాలతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంటుపడిందని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కేఏ మంగ అన్నారు. గవర్నమెంట్స్కూళ్లలో నెలకొన్న సమస్యలపై సోమవారం హుజూర్‌నగర్‌లో రౌండ్ టేబుల్ మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్. ధనమూర్తి మాట్లాడుతూ అకడమిక్ఇయర్ స్టార్ట్ అయ్యి 5 నెలలు కావస్తున్నా.. ఇంతవరకు స్టూడెంట్లకు టెక్స్ట్‌బుక్స్, యూనిఫామ్స్పూర్తి స్థాయిలో అందలేదన్నారు. టీచర్ల కొరతతో స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. స్కూళ్లలో మౌలిక వసతులు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. వెంటనే టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. పి. వెంకటరెడ్డి , క్రాంతి, అప్పారావు, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసే టీఆర్ఎస్ లో చేరుతున్నరు
యాదగిరిగుట్ట/చౌటుప్పల్, వెలుగు: సీఎం కేసీఆర్ పథకాలను చూసే మిగతా పార్టీల లీడర్లు టీఆర్ఎస్ లో చేరుతున్నారని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. బొమ్మల రామారం మండలం పిల్లిగుండ్లతండాకు చెందిన పలువురు కాంగ్రెస్ లీడర్లు సోమవారం యాదగిరిగుట్టలో మహేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారందరికీ ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. బొమ్మలరామారం ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్ తదితరులు ఉన్నారు.
టీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందాయని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని 9వ 10, 13 వార్డులలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. వ్యక్తిగత స్వార్థం కోసం బైఎలక్షన్ తెచ్చిన రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాలని
పిలుపునిచ్చారు.
డీఎఫ్‌వోకు మెమో జారీ
యాదాద్రి, వెలుగు: కలెక్టరేట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య ప్రొటోకాల్ చిచ్చు ముదురుతోంది. ప్రొటోకాల్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ డీఎఫ్‌వోకు కలెక్టర్ పమేలా సత్పతి మెమో జారీ చేశారు. సెప్టెంబర్29న భువనగిరిలో జిల్లా ఫారెస్ట్ ఆఫీస్కాంప్లెక్స్ను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్విటేషన్ కార్డులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పేర్లను ప్రింట్ చేయలేదు. పైగా శిలాఫలకంలో తన పేరుకు ప్రాధాన్యమివ్వలేదని తెలిసి శేఖర్‌రెడ్డి మీటింగ్‌కు రానని భీష్మించడంతో మంత్రులు ఒప్పించి రప్పించారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్‌లో ప్రొటోకాల్ పై కలెక్టర్ పమేలా సత్పతి ని మంత్రులు నిలదీశారని తెలిసింది. తమ తప్పేం లేదని కలెక్టరేట్ఆఫీసర్ల అప్రూవల్ తీసుకున్న తర్వాతనే శిలాపలకం రెడీ చేశామంటూ ఫారెస్ట్ఆఫీసర్లు చెప్పారని మంత్రులు కలెక్టర్‌పై సీరియస్అయ్యారు. వెంటనే దీనిపై ఆరా తీసిన కలెక్టర్ డీఎఫ్‌వో పద్మజారాణికి మెమో జారీ చేశారు. మెమోకు సమాధానం ఇవ్వకున్నా, వివరణపై సంతృప్తి కలగకున్నా.. డీఎఫ్‌వోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ప్రభుత్వాన్ని కోరే అవకాశముంది.
ఎరువులు, విత్తనాలు ఫ్రీగా ఇవ్వాలి
మునగాల( నడిగూడెం), వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎరువులు, విత్తనాలు ఫ్రీగా ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం నడిగూడెం మండలం బృందావనపురం గ్రామంలో జరిగిన రైతు సంఘం మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. స్వామినాథన్ కమిషన్ సూచనలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, అందుకే రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్‌చేశారు. అనంతరం రైతు సంఘం కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులు గా కాసాని చిట్టీ, బొడ్డు వెంకట నారాయణ ఎన్నికయ్యారు.
గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి
మిర్యాలగూడ, వెలుగు : గ్రామీణ క్రీడాకారులు నిత్యం సాధన చేస్తూ జాతీయ స్థాయిలో రాణించాలని ఎన్బీఆర్ ఫౌండేషన్చైర్మన్నల్లమోతు సిద్ధార్థ అన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను వైస్ ఎంపీపీ అమరావతి, మాజీ ఏఎంసీ చైర్మన్శ్రీనివాసరెడ్డితో కలిసి సిద్ధార్థ ప్రారంభించారు. అనంతరం కాసేపు క్రీడాకారులతో కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగల వేళ క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పెద్ది శ్రీనివాస్‌గౌడ్, మహేశ్‌గౌడ్, లింగయ్య, రవి, రజాక్, లెనిన్ పాల్గొన్నారు.
గ్రూప్–1 ఎగ్జామ్‌కు ఏర్పాట్లు పక్కాగా చేయాలి
యాదాద్రి, వెలుగు: గ్రూప్–-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహణకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని యాదాద్రి అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఎగ్జామ్ సెంటర్ల చీఫ్ సూపరింటెండెంట్లతో రివ్యూ మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక చేసిన 13 ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. డీఈవో కె. నారాయణరెడ్డి, ఎంఈవో బి.లక్ష్మీనారాయణ ఉన్నారు.
సైబర్ నేరాలపై అలర్ట్‌గా ఉండాలి
తుంగతుర్తి, వెలుగు: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని డీఎస్పీ నాగభూషణం సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ నేడు సమాజంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. ఈ మేరకు ఏవిధంగా నేరాలు జరుగుతాయో వివరించారు. సీఐ నాగార్జున గౌడ్, ఎస్సై వై.ప్రసాద్, పోలీస్‌సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.