నల్గొండ జిల్లాలో వాకింగ్ కు వెళ్తే ప్రాణాలు పోతయా?

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున వాకింగ్​కు వెళ్లిన దంపతులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. మృతుల బంధువులు, పోలీసుల కథనం ప్రకారం..పానగల్ కు చెందిన ఓర్సు విష్ణుమూర్తి (34) ఆయన భార్య స్వప్న (26 ) మంగళవారం తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్లారు. నేషనల్ హైవే 565 పై పానగల్ ఉదయ సముద్రం సమీపంలోని రోడ్డుపై నడుస్తుండగా వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కన్నుమూశారు. 

మృతురాలి ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలతో పాటు చెవి దిద్దులు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. కావాలని ఎవరైనా ఢీ కొట్టారా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి సమీపంలోని సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు. మృతులకు ఏడేండ్ల కొడుకు, రెండేండ్ల పాప ఉన్నారు. మృతుడు విష్ణుమూర్తి జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో కాంట్రాక్టు లెక్చరర్ గా పని చేస్తున్నాడు. మృతుల కుటుంబానికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రూ.2 లక్షలు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
 

దశ దిన కర్మకు వెళ్లొస్తూ అన్నదమ్ములు.. 

ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గణేశ్​పూర్ శివారులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు చనిపోయారు. దహెగాం మండలానికి చెందిన నాగుల తిరుపతి, ఇతడి భార్య పార్వతి, అతడి సోదరుడైన మంచిర్యాలకు చెందిన నాగేశ్(48) ​ఆదివారం మహారాష్ట్ర లోని చంద్రపుర్ లో జరిగిన బంధువు దశ దిన కర్మలో పాల్గొని కారులో తిరుగు ప్రయాణయ్యారు. రాత్రి చంద్రపూర్ నుంచి ఆసిఫాబాద్ వైపు వస్తుండగా..వాంకిడి మండలం గణేశ్ పూర్ దగ్గర అతివేగం, అజాగ్రతగా వచ్చిన ఓ లారీ వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. 

ఈ ఘటనలో నాగేశ్ అక్కడిక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడిన తిరుపతి, పార్వతిని ఆసిఫాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ట్రీట్​మెంట్ పొందుతూ తిరుపతి(52) కన్నుమూశాడు. సీరియస్​గా ఉన్న పార్వతిని మంచిర్యాల హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వాంకిడి ఎస్సై సాగర్ తెలిపారు.  

ఆర్టీసీ బస్సు ఢీకొని.. 

ఆత్మకూరు, వెలుగు : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడు వద్ద  మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒకరు చనిపోయారు. గూడెప్పాడ్ గ్రామానికి చెందిన మేక స్వామి రెడ్డి (70) వ్యవసాయ పనుల కోసం బావి వద్దకు సైకిల్ పై వెళ్తున్నాడు. సైకిల్​పై రోడ్డు క్రాస్​చేస్తుండగా హనుమకొండ నుంచి ములుగు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనకు నుంచి ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య సౌందర్యమ్మ ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.