జడ్పీలో సీపీఎస్ స్కీం గోల్ మాల్!

  •     డబ్బులు జమకాలేదని జిల్లా ట్రెజరీ ఆఫీసర్లను కలిసిన ఉద్యోగులు
  •     తమకు సంబంధం లేదని చెప్పిన అధికారులు  
  •      జడ్పీలోనే డబ్బులు కాజేశారని అనుమానాలు
  •     ఆందోళనలో 200 మంది ఉద్యోగులు

  నల్గొండ, వెలుగు : జిల్లా పరిషత్​లో సెంట్రల్​ కాంట్రిబ్యూషన్​ పెన్షన్​ స్కీం నిధులు గోల్​మాల్​అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2004 నుంచి 2009 వరకు సుమారు 200 మంది ఉద్యోగులకు సంబంధించిన రూ.4 కోట్లకు పైగా సీపీఎస్​ డబ్బులు అకౌంట్లలో జమ కాలేదని తెలుస్తోంది. తమ జీతాల్లోంచి సీపీఎస్​ కింద అమౌంట్​ కట్​అయినట్లు కనిపిస్తోంది.. కానీ అకౌంట్లలో వాటికి సంబంధించిన లావాదేవీలు ఏవీ కనిపించడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు జూనియర్, సీనియర్​ అసిస్టెంట్లు నల్గొండ జిల్లా ట్రెజరీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. 2010 నుంచి జడ్పీ ఉద్యోగుల జీతాలు ట్రెజరీ నుంచి పే చేస్తున్నారు. అంతకముందు ఉద్యోగుల శాలరీల నుంచి మినహాయించే జీపీఎఫ్, సీపీఎస్​ వగైరా అన్నీ జడ్పీ అకౌంట్​ డిపార్ట్​మెంట్​ ద్వారానే జరిగాయి. దీంతో అప్పటి లావాదేవీలు ట్రెజరీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో ఉద్యోగులు అవాక్కయ్యారు. లెక్కప్రకారం అయితే శాలరీల నుంచి కట్​చేసి సీపీఎస్ అమౌంట్, ప్రభుత్వ ఖాతాల్లో జమ చేస్తేనే కాంట్రిబ్యూషన్​  స్కీం వర్తిస్తుంది. కానీ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్​ జీతాల నుంచి కట్​ చేయడమే అయితే జరిగింది కానీ, ప్రభుత్వ ఖాతాల్లో జమ కాలేదు. 

ఆన్​లైన్​ చేయడంతో లొసుగులు బయటికి.. 

ట్రెజరీ ద్వారా చెల్లింపులు మొదలైనప్పటి నుంచి ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన వివరాలన్నీ ఆన్​లైన్​ చేశారు. ప్రత్యేకంగా మొబైల్ ​యాప్​లు కూడా ప్రభుత్వం అందుబాటులోకి  తెచ్చింది. దీంతో ఉద్యోగులు ఎవరి పైనా ఆధారపడకుండా శాలరీల అకౌంట్లలో జరుగుతున్న లావాదేవీలన్నీ ఎప్పటికప్పుడు చూసుకునే వెసులుబాటు లభించింది.  దీంతో ఉద్యోగులు సీపీఎస్​ డబ్బు గురించి ఆరా తీశారు. తోటివారికి  సీపీఎఫ్​ యాడ్​ కావడం, ఇంకొందరికి సీపీఎఫ్​ డబ్బులు జమ కాక పోవడంతో అనుమానం వచ్చిన ఉద్యోగులు ట్రెజరీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు సంబంధం లేదని చెప్పడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

 ఇంటి దొంగల పనేనా? 

రికార్డుల్లోనే ఎంటర్​ చేయకుండా తమ శాలరీల నుంచి కట్​ చేసిన సీపీఎస్​ డబ్బంతా అప్పుడున్న అకౌంట్​ డిపార్ట్​మెంట్స్ అధికారులు కాజేసి ఉండవచ్చని ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అధికారులు తగిన విచారణ చేయాలని బాధిత ఉద్యోగులు కోరుతున్నారు. అయితే జిల్లాల పునర్విభజనకు ముందు జరిగిన వ్యవహారం అయినందున నష్టపోయిన ఉద్యోగుల గురించి ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అప్పటి రికార్డులు, ఉద్యోగులు జిల్లాలవారీగా విడిపోయారు. కొందరు రిటైర్​మెంట్​ కాగా, ఇంకొందరు ప్రమోషన్లతో వేర్వేరు జిల్లాలో పనిచేస్తున్నారు. కనీసం ఉద్యోగ సంఘాలు కూడా జోక్యం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. మిస్సింగ్​క్రెడిట్​ జరిగి ఉండొచ్చని కొందరు చెబుతుండగా, డబ్బులు ఎక్కడికీ పోవని, జీపీఎఫ్​ సైతం ఒక్కోసారి జమకానీ సందర్భాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సీపీఎస్​ చలాన్లు ఉంటే తిరిగి అకౌంట్లలో డబ్బులు జమ చేయొచ్చని అంటున్నారు. ఏదేమైనా సమస్యను త్వరగా పరిష్కరించాలని బాధిత ఉద్యోగులు కోరుతున్నారు.