తగ్గుతున్న హార్టికల్చర్​ సాగు

తగ్గుతున్న హార్టికల్చర్​ సాగు
  • ఉద్యానవన పంటలపై రైతులకు అవగాహన కరువు
  • ఆఫీసర్లు లేక అయోమయం 
  • 3.50 లక్షల నుంచి 80 వేల ఎకరాలకు పడిపోయిన తోటలు

నల్గొండ, వెలుగు : ఉద్యానవన పంటలకు ప్రభుత్వం రాయితీలు అందిస్తున్నా జిల్లాలో ఏటా ఆ పంటలు తగ్గుతున్నాయి. రైతులకు అవగాహన కల్పించాల్సిన ఆఫీసర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు వరి వైపు మొగ్గు చూపుతుండడంతో ఆ ప్రభావం ఉద్యానవన పంటలపై పడుతుంది. దీంతో లక్షల ఎకరాల్లో సాగయ్యే ఉద్యానవన పంటలు నేడు వేల ఎకరాలకు పడిపోయింది. వ్యవసాయ అనుబంధ రంగమైన ఉద్యానవన పంటల సాగుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నీలినీడలు అలుముకుంటున్నాయి. 

ఉద్యాన పంటలు ప్రధానంగా బత్తాయి, నిమ్మ, ఆయిల్‌పామ్‌, బొప్పాయి, కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 59 మండలాలకు ఉన్న హెచ్‌వోలతోనే ప్రభుత్వం సరిపెడుతూ, ఉద్యానశాఖలో కొత్తగా ఒక పోస్టును కూడా పెంచలేదు. 8 నుంచి 10 మండలాలకు ఒక హెచ్‌వో (హార్టికల్చర్‌ అధికారి) మాత్రమే ఉండడంతో రైతులకు సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. 

దేశంలోనే ఎక్కువ సాగు..

గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పండ్ల తోటల సాగు దేశంలో నంబర్‌ వన్‌గా ఉండేది. అదికాస్తా ఇప్పుడు అట్టడుగుకు పడిపోయింది. గతంలో 3.50 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు ఉండగా, ప్రస్తుతం మూడు జిల్లాల్లో 70 నుం చి 80 వేల ఎకరాలకు మించి లేవు. ప్రస్తుతం ఆయిల్‌పామ్‌, కూరగాయల సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పామ్‌ సుమారు 17 వేల ఎకరాల్లో సాగవుతోంది. 

అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 12 వేల ఎకరాలు, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 5 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సాహించాలనే ఆలోచనతో ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇస్తుంది. కూరగాయలు 6 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. 

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 90 యూనిట్ల కూరగాయల సాగుకు నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఒక్క నల్గొండ జిల్లాలో మాత్రమే బత్తాయి 43 వేల ఎకరాలకు పడిపోగా, నిమ్మ 9 వేల ఎకరాల్లో సాగవుతోంది. 12 వేల ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. దొండ పందిర్లు 800 ఎకరాల్లో ఉండగా, ఇతర కూరగాయలను కూడా రైతులు సాగుచేస్తున్నా రు.

మార్కెట్ లేక ధరలపై గందరగోళం..

బత్తాయి, నిమ్మకు మార్కెట్‌ లేక ధరలపై గందరగోళంగా నెలకొంది. ఎప్పుడు ధర తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. దీంతో బత్తాయి, నిమ్మ తోటల సాగుకు వెనుకంజ వేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం అత్యధికంగా ఆయిల్‌పామ్‌ సాగుకే మొగ్గు చూపుతుండగా, ఆ తర్వాత కూరగాయలు, నిమ్మ, బత్తాయిపై దృష్టి పెట్టింది. 

నిమ్మ, బత్తాయికి తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండడం సమస్యగా మారింది. దీనికి తోడు నిమ్మకు మాత్రమే నకిరేకల్‌లో మార్కెట్‌ఉండగా, బత్తాయికి మాత్రం ఉమ్మడి జిల్లాలో మార్కెటే లేదు. దీంతో వ్యాపారులు, దళారులు రైతుల నుంచి బత్తాయి కొనుగోలు చేసి ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, ముంబై వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

ఆచరణలో సాద్యం కాని హామీలు..

కొండమల్లేపల్లిలోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 10 ఎకరాలను ప్రత్యేకంగా మహారాష్ట్రలోని నాగపూర్‌ పరిశోధన కేంద్రం, ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యానశాఖకు అప్పగించాలని ప్రభుత్వం యోచించినా అది అమలు కాలేదు.

మహారాష్ట్రంలోని నాగపూర్‌లో ఉన్న రిసెర్చ్‌ సెంటర్‌కు కొండమల్లేపల్లిలో ఉన్న కేంద్రానికి అనుసంధానం చేసి అధ్యయనం చేయాలని ప్రతిపాదనలు ఉన్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. దీంతో కొండమల్లేపల్లిలోని రీసెర్చ్​ ‌సెంటర్‌ నిరుపయోగంగా మారిందనే విమర్శలు ఉన్నాయి.