సంస్థాన్ నారాయణపురం, వెలుగు : మునుగోడు అభివృద్ధిపై వివక్ష చూపుతూ, ప్రజలపై చిన్నచూపు చూస్తున్న టీఆర్ఎస్ ను ఉప ఎన్నికల్లో ఓడించాలని టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ మీటింగ్‌లో మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నారని కనీస నిధులు కూడా ఇవ్వలేదని, రోడ్ల మరమ్మతులు కూడా చేయలేదన్నారు. నియోజకవర్గ సమస్యలపై తెలుగుదేశం అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు ఏర్పుల సుదర్శన్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ముద్ధం శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు అవ్వారి సుబ్బారావు, బద్దుల యాదగిరి, దుబ్బాక స్వామి, ఈధుల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
గీత కార్మికులకు గీతన్నబంధు ఇవ్వాలె
యాదగిరిగుట్ట, వెలుగు: ప్రమాదవశాత్తు గీతకార్మికులు చనిపోయాక ప్రభుత్వం ఇస్తున్న ఎక్స్ గ్రేషియోకు బదులు.. బతికున్నప్పుడే ఆర్థికంగా ఉపయోగపడే పథకాలు ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘దళితబంధు’ పథకంలా గీతకార్మికుల కోసం ‘గీతన్నబంధు’ ఇవ్వాలన్నారు. యాదగిరిగుట్టలో ఆ సంఘం 3వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గీతకార్మికులకు సంబంధించిన ప్రతి సొసైటీకి ఐదెకరాల భూమి కేటాయించాలని, 560 జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏండ్లు నిండిన ప్రతి గీతకార్మికుడికి షరతులు లేకుండా నెలకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రమాదవశాత్తు చనిపోయిన గీతకార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. అంతకు ముందు వైకుంఠ ద్వారం నుంచి బహిరంగ సభ ప్రాంగణం వరకు గీతకార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజు గౌడ్, ఆహ్వాన సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్, టీకేజీకేఎస్ జిల్లా అధ్యక్షుడు బొలగాని జయరాములు గౌడ్, మండల అధ్యక్షుడు కోల వెంకటేష్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ హేమేందర్ గౌడ్, తుర్కపల్లి మండల కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీరామమూర్తి గౌడ్ పాల్గొన్నారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలె
మునగాల, వెలుగు : సైబర్ నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూర్యాపేట జిల్లా షీ టీం ఇన్చార్జి పాండు నాయక్ కోరారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైబర్ నేరాల అవగాహన కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడారు. విద్యార్థులకు సైబర్ నేరాలు, - ప్రభుత్వ సేవలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై టోల్ ఫ్రీ నెంబర్ 100 తోపాటు, 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సాయి ఈశ్వరి, జిల్లా పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ ఎల్లయ్య, మునగాల ఏ ఎస్ ఐ మల్సూర్, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
కోదాడ, వెలుగు : కోదాడ, అనంతగిరి మండలాల్లోని జరుగుతున్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అధికారులను ఆదేశించారు. ఆయా మండలాల్లో అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పనులపై స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు మండలాల్లోని 5 గ్రామాల్లో మాత్రమే స్టేడియాలు పూర్తి అయ్యాయని, మిగతా పనులు 30రోజులలో పూర్తి చేయాలని, అవసరమైన స్థలాలను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆర్ డీ వో కిశోర్ కుమార్ ను ఆదేశించారు.
9వ విడత హరిత హారం కోసం ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రామాలలో ఉపాధి హామీ పనులు గుర్తించి, జాబ్ కార్డ్ హోల్డర్స్ కు వంద రోజులు పని కల్పించేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ సుందరి కిరణ్ కుమార్, ఏపీడీ డాక్టర్ పెంటయ్య, డీ ఎల్ పీ ఓ శ్రీరాములు, ఎంపీడీవో విజయ శ్రీ, శ్రీనివాస రావు, పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి
హుజూర్ నగర్, వెలుగు: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దుగ్గి బ్రహ్మం డిమాండ్ చేశారు. బుధవారం హుజూర్ నగర్ లోని రైతులతో కలిసి మండల వ్యవసాయ అధికారి స్వర్ణ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాల తో పంటలు నేలకు ఒరిగి, రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వ్యవసాయ , రెవెన్యూ అధికారులు పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులు వివరాలు సేకరించాలని, పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పోసనబోయిన హుస్సేన్, తంగెళ్ల వెంకట చంద్ర, చింతకుంట్ల వీరయ్య, , మేగడ రాములు కార్యదర్శి పిన్నపురెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో బల్మూరి వెంకట్
చౌటుప్పల్ వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెంలో ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటి ఇంటికీ తిరుగుతూ తమ పార్టీకి ఓటు వేయాలని కాళ్ళు మొక్కారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తరిమికొట్టాలంటే మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరాడు. కార్యక్రమంలో నాయకులు దండం రామ్ రెడ్డి, వల్లబోతు నారాయణ, భక్తుల శ్రీహరి, మంగ ప్రవీణ్, డెంకం రాహుల్ పాల్గొన్నారు.
అక్రమంగా నిల్వ చేసిన బెల్లం పట్టివేత
హుజూర్‌నగర్, వెలుగు: అక్రమంగా నిల్వ ఉంచిన బెల్లాన్ని ఎక్సైజ్‌అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ శ్యాంసుందర్ వివరాల ప్రకారం పట్టణంలోని కూరగాయల మార్కెట్‌పక్కన అయ్యప్ప కిరాణం షాపులో 4 బస్తాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 160 కేజీల బెల్లం ఉన్నట్టు సమాచారం అందగా.. దాన్ని స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు.
21న వాహనాల వేలం ..
ఎక్సైజ్‌శాఖ అధికారుల దాడుల్లో పట్టుబడ్డ వాహనాల వేలంపాటను ఈనెల21న ఎక్సైజ్ ఆఫీస్‌లో నిర్వహించనున్నట్లు సీఐ శ్యాంసుదర్ తెలిపారు. వేలంలో పాల్గొనేవారు వాహన ధరలో 50 శాతం ఈఎండీ చెల్లించాలన్నారు.