నల్గొండ, వెలుగు: డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పరిధిలో నీటి నిల్వల సామర్ధ్యాన్ని తెలుసుకునేందుకు నల్గొండ జిల్లా భూగర్భ జలపరిశోధన శాఖ, కర్ణాటకలోకి బెల్గాంకు చెందిన నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ ఆధ్వర్యంలో పరిశోధన చేస్తున్నారు. ఇందులో భాగంగా డిండి స్కీం పరిధిలో ప్రస్తుతం నిర్మిస్తున్న రిజర్వాయర్ల కింద భూగర్భజలాలు ఎంత లోతులో ఉన్నాయి ? ఆ ప్రాంతాల్లో మట్టి ఏ రకంగా ఉంది..? వర్షాలు వచ్చినప్పుడు రిజర్వాయర్ల కండిషన్ ఏ రకంగా ఉంటుంది ? అనే అంశాలను తెలుసుకుంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని చారకొండ, వంగూరుతో పాటు, డిండి నుంచి చౌటుప్పుల్ వరకు రిజర్వాయర్ల పరిధి విస్తరించి ఉంది. దేవరకొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లోని రిజర్వాయర్ల పరిధిలోని పలు గ్రామాల్లో పది రోజుల పాటు పరిశోధనలు చేయనున్నారు. దీంతో పాటు సోషియో ఎకానమిక్ సర్వే కూడా చేస్తున్నారు. అంటే రిజర్వాయర్ల కింద రైతులు ఏ రకమైన పంటలు సాగు చేస్తే మేలు జరుగుతుంది.. ప్రస్తుతం బోర్ల కింద ఎంత ఆయకట్టు సాగవుతుంది.. అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఈ పరిశోధనల ఆధారంగా భవిష్యత్‌లో రిజర్వాయర్లలో నీటి నిల్వలు చేరాక అప్పటి పరిస్థితులతో పోలుస్తామని ఆఫీసర్లు చెప్పారు. గత రెండు రోజులుగా మునుగోడు, మర్రిగూడ మండలాల్లోని చీకటిమామిడి, చల్మెడ, గట్టుప్పల్, నామాపూర్, నార్కట్‌పల్లి మండలం నేరెడ, పిట్టంపల్లి, నార్కట్‌పల్లి మండలాల్లో పరిశోధనలు చేశారు.
నారసింహుడిని దర్శించుకున్న జానారెడ్డి
యాదగిరిగుట్ట/యాదాద్రి, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం మాజీమంత్రి కుందూరు జానారెడ్డి దర్శించుకున్నారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేసి, ప్రధానాలయ ముఖమంటపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం అద్దాల మండపం వద్ద అర్చకులు వేదాశీర్వచనం చేయగా.. ఆఫీసర్లు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ యాదగిరిగుట్ట ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు, ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య, జడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి ఉన్నారు. అలాగే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గుగులోతు శంకర్‌నాయక్ శుక్రవారం సాయంత్రం స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ను పరామర్శించారు.
ప్రొఫెషనల్ కోర్సుల ట్రైనింగ్‌కు అప్లై చేసుకోండి
యాదాద్రి, వెలుగు: స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ట్రైనింగ్, ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్‌కు అప్లై చేసుకోవాలని డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కె.సత్యనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముస్లిం, సిక్కు, జైన్, పార్శీ, బుద్ధిస్ట్ వర్గాలకు చెందిన వారికి ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులైన వెబ్ డెవలపర్, హార్డ్‌వేర్, నెట్ వర్కింగ్, సాఫ్ట్ వేర్ ఇన్‌స్టాలేషన్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 14 లోగా అప్లై చేసుకోవాలని, మరిన్ని వివరాలకు మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసులో సంప్రదించాలని సూచించారు.
బహిరంగంగా మద్యం తాగితే కఠిన చర్యలు
సూర్యాపేట, వెలుగు: బహిరంగంగా మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో రైడ్స్ నిర్వహిస్తూ 500లకు పైగా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పట్టణ శివారు ప్రాంతాలు, ఆట స్థలాలు, స్కూళ్లు, చెరువు కట్టల వంటి ఏరియాల్లో ప్రతి రోజు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గ్లోబల్ జియో ట్యాగింగ్ చేసి ప్రతి రోజు నాలుగు విడతల్లో తనిఖీలు చేస్తున్న్టలు చెప్పారు. సూర్యాపేట, కోదాడ, నేరేడుచర్ల, తిరుమలగిరి, హుజూర్‌నగర్, తుంగతుర్తి వంటి పట్టణాలతో పాటు, అన్ని మండల కేంద్రాల్లోను పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వడ్ల దిగుబడిలో తెలంగాణే ఫస్ట్ : జగదీశ్ రెడ్డి
హాలియా, వెలుగు : వడ్ల దిగుబడిలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ ప్లేస్‌లో ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా అనుముల మండలం పాలెం సమీపంలో కొత్తగా కట్టిన వజ్ర తేజ రైస్ ఇండస్ట్రీని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొత్త టెక్నాలజీతో రైస్ మిల్లులను ఏర్పాటు చేస్తే కేంద్రంతో పని లేకుండా వడ్లను ఇక్కడే కొనుగోలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గతేడాది 40 లక్షల
టన్నుల వడ్ల దిగుబడితో తెలంగాణ రికార్డు సృష్టించిందని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యాధునిక టెక్నాలజీతో మరిన్ని రైస్‌మిల్లులను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో మిర్యాలగూడ, నల్గొండ, హుజూర్‌నగర్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు నలమోతు భాస్కరరావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్ ఇరిగి పెద్దులు, నాయకులు జూలకంటి రంగారెడ్డి, ఎడవల్లి విజయేందర్‌రెడ్డి, జాతీయ మిల్లర్స్ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గంప గోవర్ధన్, జిల్లా అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలె
గరిడేపల్లి, వెలుగు: చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని హుజూర్‌నగర్ జూనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్ర సూచించారు. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి మోడల్ స్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. కాలేజీల నిర్వాహకులు కోరితే కోర్టులో జరిగే వాదప్రతివాదాలను స్టూడెంట్లకు ప్రత్యక్షంగా చూపించే అవకాశం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధికార ప్రతినిధి శ్రీనివాసరావు, అదనపు పీపీ శ్రీనివాస్, ఏజీపీ గోపాలకృష్ణమూర్తి, గరిడేపల్లి ఎస్సై కొండల్‌రెడ్డి, లాయర్లు రాఘవరావు, అంజయ్య, వెంకటేశ్వర్లు, సైదులు, నవీన్, ప్రిన్సిపాల్ దండెం రవికుమార్, సర్పంచ్ నాగేశ్వరరావు, ఎంపీటీసీ మేకల స్రవంతి పాల్గొన్నారు.
పల్లెప్రగతితో సమస్యల పరిష్కారం
దేవరకొండ (పీఏపల్లి), వెలుగు: పల్లె ప్రగతితో మారుమూల గ్రామాల్లోని సమస్యలు సైతం పరిష్కారం అవుతున్నాయని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చెప్పారు. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం అక్కంపల్లిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లోనే షాదీముబారక్, రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందన్నారు. కార్యక్రమంలో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, వైస్ ఎంపీపీ అర్వపల్లి సరిత నర్సింహ పాల్గొన్నారు.
ఇమాంపేట కేజీబీవీ ఎస్‌వోపై వేటు
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా ఇమాంపేట కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ప్రేమలతను విధుల నుంచి తొలగిస్తూ డీఈవో అశోక్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీవీల బిల్లుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల ‘వెలుగు’ దినపత్రికలో పబ్లిష్ అయిన స్టోరీకి స్పందించిన ఆఫీసర్లు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అక్రమాలు నిజమేనని తేలడంతో రెండు రోజుల క్రితం కేజీబీవీ కో ఆర్డినేటర్ రమణ డిప్యూటేషన్ రద్దు చేసిన ఆఫీసర్లు, తాజాగా ఇమాంపేట ఎస్‌వో ప్రేమలతను డ్యూటీ నుంచి రిమూవ్ చేశారు. ఎస్‌వో ప్రేమలత స్కూల్‌కు సంబంధించిన ఫర్నిచర్‌ను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడంతో పాటు, బిల్లుల్లో అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకుని, ఫర్నిచర్ అమ్మిన డబ్బులు రూ. 17,677ను జిల్లా పంచాయతీ రాజ్ శాఖకు చెందిన అకౌంట్‌లో డిపాజిట్ చేయాలని ఆదేశించారు.
మెయిన్ రోడ్డు పనులను ప్రారంభించాలి
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట పట్టణంలో మెయిన్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెయిన్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి ఏండ్లు గడుస్తున్నా బాధితులను ఇప్పటివరకు ఆదుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం, డబుల్ బెడ్‌రూమ్, మోడల్ మార్కెట్‌లో షాపులను కేటాయించాలని డిమాండ్ చేశారు. షాపుల ఓనర్లకే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి ఇండ్లను కూల్చివేయడం సరికాదన్నారు. వారికి నష్టపరిహారం చెల్లించి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మెయిన్ రోడ్డును
పరిశీలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు వేణారెడ్డి, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, అమ్జద్ అలీ, మడిపెల్లి విక్రమ్, పోతు భాస్కర్, ఆలేటి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.