చౌటుప్పల్, వెలుగు: మునుగోడు బై ఎలక్షన్ లో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 26, 27 పోలింగ్‌బూత్‌లలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్ ఆధ్వర్యంలో ‘బీజేపీ ఇంటింటి ప్రచారం’ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ఓటర్లకు వివరిస్తూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రమణగోని శంకర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల డబ్బులను పక్కదారి పట్టిస్తూ మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిందన్నారు. బైఎలక్షన్లో బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి రాజగోపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బూత్ లెవల్ ఇంఛార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, ప్రెసిడెంట్కడారి ఐలయ్య, ఎర్రగొండ సత్యనారాయణ పాల్గొన్నారు.
అండర్ పాస్ ఏర్పాటు చేయాలి
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట –ఖమ్మం హైవేపై చివ్వెం ల మండలం అక్కలదేవి గూడెం వద్ద అండర్ పాస్, సర్వీస్ రోడ్లు నిర్మించాలని రైతులు, ప్రజలు హైవేపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్కలదేవి గూడెం వద్ద అండర్ పాస్, సర్వీస్ రోడ్లు నిర్మిస్తే రాకపోకలు అనువుగా ఉంటుందని అన్నారు. అండర్ పాస్ లేకపోవడంతో జిల్లా కేంద్రానికి వెళ్తేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందని, ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
యాదాద్రి, వెలుగు: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి వి బాల భాస్కర్‌రావు తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి.. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం రాంపల్లిలోని ఫౌల్ట్రీ ఫాంలో అస్సోం రాష్ట్రానికి చెందిన ప్రియాబర్ గొగాయ్ ఎలక్ట్రీషన్‌గా పని చేసేవాడు. తాగుడికి బానిసై సరిగా పని చేయకపోవడంతో పౌల్ట్రీ ఫామ్‌కు వచ్చిన జాయింట్ ఎండీ రాగాల శివ శాంతకుమార్ ఆయన గదికి తాళం వేయించాడు. 2017 నవంబర్ 7న పౌల్ట్రీ ఫామ్‌కు వచ్చిన ప్రియాబర్ గొగాయ్ తన గదికి తాళం వేసి ఉండడంతో వాచ్మెన్ జిందార్పాల్తో గొడవకు దిగాడు. గది పక్కనే ఉన్న గొడ్డలితో జిందార్ పాల్ తలపై కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్న టైంలో బెయిల్‌పై వచ్చిన నిందితుడు పారిపోయాడు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంతో హెల్త్ డిపార్ట్మెంట్ సాయంతో ఆధార్, సెల్‌ఫోన్ నెంబర్‌ను పోలీసులు సంపాదించారు. కేరళలో ఉంటున్న అతడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. నేరం రుజువు కావడంతో జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి తీర్పు చెప్పారు.
ఉపాధి కేంద్రంగా యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహుడి ఆలయం ఆధ్యాత్మిక, టూరిజం ప్రాంతంగానే కాకుండా రానున్న రోజుల్లో ఉపాధి కేంద్రంగా మారనుందని స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ మంత్రి రాజేశం గౌడ్ అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడిని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం హరిత హోటల్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజుల కాలంలో ఆలయాలు నిర్మించేందుకు మూడు తరాలు పట్టిందని పురాణాలు చెప్తున్నాయని, కానీ ఆరు నెలల్లోనే యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారన్నారు. ట్రిఫుల్‌ఆర్ పూర్తయితే యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. అంతకు ముందు అర్చకులు ఆలయ మర్యాదలతో రాజేశం గౌడ్‌కు స్వాగతం పలకగా, ఆఫీసర్లు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.
నవంబర్ 10 నుంచి డీఈఎల్ఈడీ పరీక్షలు
నల్గొండ అర్బన్, వెలుగు: డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యూకేషన్(డీఈఎల్ఈడీ) సెకండియర్ వార్షిక పరీక్షలు నవంబర్ 10 నుంచి 16 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో బొల్లారం భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. 2020–22 బ్యాచ్, గతంలో ఫెయిలైన విద్యార్థులు పరీక్షలకు హాజరు కావచ్చని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు.
కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
యాదాద్రి, వెలుగు : భువనగిరి మండలం రాయగిరిలో మంగళవారం కరెంట్ షాక్‌తో వ్యక్తి చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి ( 54) తన వ్యవసాయ బావి వద్ద మోటారు రిపేర్ చేయించేందుకు ఎలక్ట్రీషన్దూడల శంకర్ తో కలిసి వెళ్లాడు. శంకర్ వ్యవసాయ బావి వద్ద మోటార్ రిపేర్ చేస్తుండగా , గోవర్ధన్ రెడ్డి కి తెగిపోయిన కరెంట్ తీగ తాకింది. గోవర్ధన్‌రెడ్డి కింద పడిపోయాడు. వెంటనే 108 సాయంతో ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు కార్తీక్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రూరల్ ఎస్సై హెచ్.రాఘవేందర్ తెలిపారు.
19న గుట్టలో గీత కార్మికుల బహిరంగ సభ
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో ఈ నెల 19న గీత కార్మికుల సింహగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజు గౌడ్ తెలిపారు. కుటుంబ సమేతంగా గీత కార్మికులు తరలివచ్చి బహిరంగ సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. యాదగిరిగుట్టలో మంగళవారం నిర్వహించిన జిల్లా కమిటీ మీటింగ్ లో బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గీతకార్మికులకు ‘గీతన్న బంధు’ ప్రకటించి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. సొసైటీలకు భూమి కేటాయించాలని, ప్రతి జిల్లాలో నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మద్దెల రాజయ్య, జిల్లా అధ్యక్షుడు రాగీరు కృష్ణయ్య, యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కోల వెంకటేశ్ గౌడ్, జిల్లా కార్యదర్శి జయరాములు, తుర్కపల్లి మండల అధ్యక్షుడు మారగౌని శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
దళిత బంధు లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేయాలె
కోదాడ, వెలుగు: రాష్ట్రంలో ‘దళిత బంధు’ అమలులో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా కలెక్టర్ ఎంపిక చేయాలని టీఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబు మాదిగ డిమాండ్ చేశారు. దళితబంధు అమలులో అవకతవకలు అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కోదాడ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు తెచ్చి దళితుల ఆత్మగౌరవాన్ని ఎమ్మెల్యే లకు తాకట్టుపెట్టిందని మండిపడ్డారు. దళితబంధు ఎంపికలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. బచ్చలకూరి నాగరాజు , మాతంగి రామారావు, కందుల శ్రీను, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రేషన్ షాపుల్లో విజిలెన్స్ ఆఫీసర్ల తనిఖీలు
మిర్యాలగూడ, వెలుగు : పట్టణంలోని పలు రేషన్ షాపులపై మంగళవారం ఉమ్మడి నల్గొండ విజిలెన్స్ టీం తనిఖీలు చేపట్టింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో తనిఖీలు ప్రారంభించిన అధికారులు మధ్యాహ్నం వరకు కొనసాగించారు. గాంధీనగర్‌లోని రేషన్ షాపు–2, రిజిస్ర్టేషన్ ఆఫీస్, శివాలయం సమీపంలోని 26,27, అదే విధంగా అశోక్‌నగర్ రేషన్ దుకాణం 30లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఆఫీసర్లు మాట్లాడుతూ లబ్ధిదారులు స్టాక్డీటెయిల్స్తీసుకున్నామన్నారు. ప్రస్తుతం తనిఖీలు చేపట్టిన దుకాణాల్లో గుర్తించిన స్టాక్ వివరాల నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. సీఐ మహేశ్, ఎస్సై గౌస్, కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి, డీటీ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఏపీలో మిర్యాలగూడ స్టూడెంట్ సూసైడ్
మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ స్టూడెంట్ ఏపీలోని ఓ యూనివర్సిటీలో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మల్గిరెడ్డి వెంకట్‌రెడ్డి చిన్న కుమారుడు యశ్వంత్‌రెడ్డి(20) గుంటూరు జిల్లా వడ్డేశ్వరం వద్ద గల కేఎల్
యూనివర్సిటీలో సీఎస్ఈ ఫస్ట్ ఇయర్చదువుతున్నాడు. ఇటీవల దసరా పండుగకు మిర్యాలగూడ వచ్చిన యశ్వంత్‌రెడ్డిని ఈ నెల 10న కుటుంబ సభ్యులు కాలేజీ కి పంపించి వచ్చారు. మంగళవారం యశ్వంత్‌రెడ్డి యూనివర్సిటీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు మేనేజ్మెంట్ తెలిపినట్లు చెప్పారు.
స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలె
సూర్యాపేట, వెలుగు: కుశిక అనే చిన్నారి మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని లంబాడీ విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బానోత్ హరీశ్‌నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి ఎదుట విద్యార్థిసేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న కుశిక బస్సు డ్రైవర్‌నిర్లక్ష్యంగా నడపడంతో టైర్ల కింద పడి చనిపోయిందన్నారు. వెంటనే స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూడవత్ రవిచంద్ సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆలిండియా పోలీస్ హాకీ పోటీలకు జిల్లా కానిస్టేబుల్
నల్గొండ అర్బన్, వెలుగు: ఆలిండియా పోలీస్ నేషనల్ హాకీ పోటీల్లో పాల్గొంటున్న తెలంగాణ జట్టుకు జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఎంపికయ్యారు. నల్గొండ వన్‌టౌన్ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ఎండీ ఫరూక్ జాబ్చేస్తూనే హాకీలో రాష్ర్ట, జాతీయ స్థాయిలో ఆడి ప్రతిభ చూపారు. నవంబర్16 – 30 వరకూ పశ్చిమ బెంగాల్ లో జరగనున్న పోటీల్లో పాల్గొననున్నారు. కానిస్టేబుల్ ఫరూక్‌ను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇమాం కరీమ్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసచారి తదితరులు అభినందించారు.
పోడు భూములను పరిశీలించిన కలెక్టర్
మేళ్లచెరువు, వెలుగు: మండలంలోని వేపల మాదారం రెవెన్యూ పరిధిలోని పోడు భూములను మంగళవారం కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి 2005 కు ముందు సాగులో ఉన్న వారు, సాగు వివరాలు, నివాసం ఉంటున్న వారి వివరాలను తెలుసుకున్నారు. అప్లికేషన్లను పరిశీలించి, అటవీ భూమి హద్దులు నిర్ణయించి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం1,478 ఎకరాలకు గానూ 416 అప్లికేషన్లు వచ్చినట్లు తహసీల్దార్ దామోదర్ రావు తెలిపారు. డీఎఫ్‌వో సతీశ్ కుమార్, ఆర్డీవో వెంకారెడ్డి, ఎంపీడీవో ఇషాక్ హుస్సేన్ ఉన్నారు.
‘పాలేరు’ ప్రభారీగా వెంకట నారాయణరెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు: ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గ ప్రభారీ (ఇన్చార్జి) గా నూకల వెంకట నారాయణ రెడ్డి నియామ
కమయ్యారు. బీజేపీ జాతీయ నాయకులు సునీల్‌బన్సల్, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఇతర ముఖ్య నేతల సమావేశం రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ప్రభారీలను నియమించారు. ఉత్తర భారతదేశంలో ఇదే విధంగా ప్రభారీలను నియమించి బీజేపీ నేతలు చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. అదే వ్యూహాన్ని రాష్ర్టంలో అమలు చేస్తున్నారు. ‘నూకల’ ఎన్నిక పట్ల జిల్లాకు చెందిన జాతీయ, రాష్ర్ట, జిల్లా నాయకులు అభినందనలు తెలిపారు.
సీసీఐ ద్వారా పత్తి కొనుగోలుకు సిద్ధం
సూర్యాపేట, వెలుగు: జిల్లాలోని జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించి మద్దతు ధరకే పత్తి కొనేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అడిషినల్ కలెక్టర్‌ఎస్. మోహన్‌రావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఖరీఫ్–-2022 సీజన్పత్తి కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1,07,308 ఎకరాల్లో పత్తి సాగు చేశారని తెలిపారు. మరో రెండు వారాల్లో పత్తి చేతికొస్తుందని చెప్పారు. ప్రస్తుతం పత్తికి మద్దతు ధర క్వింటాల్‌కు మధ్యరకం పింజ రూ.6,080, పొడవు పింజ ధర రూ.6,380 ఉందన్నారు. బహిరంగ మార్కెట్లో రూ. 8వేల వరకు ఉందని, వ్యాపారులు రేటు తగ్గిస్తే వెంటనే సీసీఐ ద్వారా మద్దతు ధరకు రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నామన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్, మార్కెటింగ్‌అధికారి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాజగోపాల్‌రెడ్డి కారు గుర్తుపై గెలిచిండు!
యాదాద్రి, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నోరు జారారు. ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కారు గుర్తుపై గెలిచారంటూ కామెంట్ చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రచారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ తరపున రాజగోపాల్‌రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూసుకుంట్ల ఓడిపోయారు. కారు గుర్తుపై పోటీ చేసిన రాజ గోపాల్‌రెడ్డి గెలిచారు’ అని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అయితే ఎవరూ ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లలేదు. వీడియో వైరల్ కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు తల పట్టుకున్నారు.
కూసుకుంట్ల గెలిస్తేనే పనులైతయ్..
టీఆర్ఎస్అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలిస్తేనే పనులు అవుతాయని లేకుంటే కావని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ‘నాలుగేండ్లు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి తట్టెడు పారపని చేయలే. ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే ఈ ఒక్క ఏడాది ఏం చేస్తడు? ఇంకో సంవతస్సరం అధికారంలో ఉండేది కేసీఆర్ కారు గుర్తే. కారు గుర్తుకు ఓటేసీ కూసుకుంట్లను గెలిపిస్తే ముఖ్యమంత్రి దగ్గర పనులు చేయించుకోవచ్చు’ అని అన్నారు.