చండూరు, వెలుగు : మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఓటు హక్కు కోసం వచ్చిన అప్లికేషన్లను శనివారం నల్గొండ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, బీఎల్‌వోలతో కలిసి చండూరు రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్‌లో అప్లికేషన్లను స్క్రూట్నీ చేశారు. కొత్తగా పెళ్లి అయిన వారు, ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 సంత్సరాలు నిండిన వారికి మాత్రమే ఓటు హక్కు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ నెల 10న ప్రజావాణి రద్దు
నల్గొండ అర్బన్, వెలుగు : ఆఫీసర్లు మునుగోడు అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉన్నందున ఈ నెల 10న ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు నల్గొండ కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి ఉండదన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
స్వర్ణతాపడానికి రూ.15.05 లక్షల విరాళం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమాన గోపుర బంగారు తాపడం కోసం ‘హైదరాబాద్ పవర్ ఇన్ట్సలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ తరఫున రూ.15,05,116 విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన డీడీని కంపెనీ ప్రతినిధి కేశవరెడ్డి శనివారం ఆలయ ఏఈవో గజవెల్లి రఘుకు అందజేశారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
కొనసాగుతున్న సాగర్ నీటి విడుదల
హాలియా, వెలుగు : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువ నుంచి 1,81,406 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 16 గేట్లను ఐదు ఫీట్ల మేర ఎత్తి 1,29,264 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి కుడికాల్వకు 9,013 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 6,424, ఎస్‌ఎల్‌బీసీకి 2,400, వరద కాల్వకు 400, మెయిన్ పవర్ హౌజ్ ద్వారా 33,739 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
పులిచింతల 7 గేట్లు ఓపెన్
మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్ట్‌కు 1.82 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 7 గేట్ల ద్వారా 1.96 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 42.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
19 నుంచి రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈ నెల 19 నుంచి రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ (అండర్ 13)బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామారావు, ప్రధాన కార్యదర్శి రంగారావు, కోశాధికారి రంగా శ్రీధర్ చెప్పారు. శనివారం స్థానికంగా మీడియాతో మాట్లాడారు. ఈ పోటీలకు సుమారు 200 మంది ప్లేయర్లు హాజరుకానున్నట్లు చెప్పారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారిని అండర్ 15, 17 విభాగంలో ఆడించడంతో పాటు, అండర్ 13 జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో డాక్టర్ అంజయ్య, జిల్లా కోచ్ రామకృష్ణ, పీడీ వెంకటేశ్వర్లు, రేపాల లక్ష్మీకాంతం పాల్గొన్నారు.
అర్హులకే డబుల్ ఇండ్లు ఇవ్వాలి
మునగాల (మోతె), వెలుగు : సూర్యాపేట జిల్ల మోతెలో నిర్మించిన డబుల్ ఇండ్లను అర్హులైన వారికి ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు డిమాండ్ చేశారు. శనివారం స్థానికంగా నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గ్రామంలో 64 ఇండ్లు మంజూరు కాగా, మొత్తం 233 మంది అప్లై చేసుకున్నారన్నారు. ఆఫీసర్లు ప్రతి అప్లికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, దరఖాస్తుదారుడితో మాట్లాడి అర్హులైన వారిని గుర్తించాలని కోరారు. అర్హుల ఎంపికలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకుండా చూడాలన్నారు. సీపీఎం మండల కమిటీ సభ్యుడు గుంటగాని ఏసు, షేక్ జహంగీర్, చర్లపల్లి వెంకన్న , సైదులు, వెంకన్న పాల్గొన్నారు.
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
మునుగోడు, వెలుగు : ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిక్కర్, నగదు రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పోలీసులు స్పెషల్ టీమ్‌లుగా ఏర్పడి గ్రామాల్లో తనిఖీ చేయాలని సూచించారు. అక్రమ మద్యం సరఫరాను అడ్డుకోవాలన్నారు.
ఎలక్షన్ టీంలు అలర్ట్‌గా ఉండాలి
నల్గొండ అర్బన్, వెలుగు : మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా ప్లయింగ్ స్క్వాడ్, వీఎస్‌టీఎస్, ఎస్‌టీ టీంలు అలర్ట్‌గా ఉండాలని నల్గొండ ఆర్డీవో జయచంద్రారెడ్డి సూచించారు. నల్గొండ జిల్లా చండూరు, మునుగోడు, గట్టుప్పల్ మండలంలో శనివారం తనిఖీలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోడ్ ఉల్లంఘనలు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
హాలియా, వెలుగు : చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో చనిపోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం నాయినవానికుంటలో శనివారం వెలుగుచూసింది. పెద్దవూర ఎస్సై పచ్చిపాల పరమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రామావత్ బాల (35) కరెంట్ సాయంతో స్థానిక చింతల చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ సమయంలో కరెంట్ షాక్ కొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. మృతుడి తండ్రి లక్ష్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బీజేపీని తరిమికొట్టాలి
చండూరు, వెలుగు : మునుగోడులో టీఆర్‌ఎస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీఆర్‌ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సూచించారు. శనివారం చండూరులో జరిగిన టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం నియోజకవర్గాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ తరిమికొట్టాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సంత్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.
ఇన్సూరెన్స్ చెక్కు అందజేత
దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లికి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త ఎర్ర రామస్వామి ఇటీవల చనిపోయాడు. అతడికి పార్టీ ఇన్సూరెన్స్ కింద మంజూరైన రూ. 2 లక్షల చెక్కును మృతుడి భార్య వెంకటమ్మకు శనివారం ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేశ్‌గౌడ్, టీవీఎన్ రెడ్డి, రైతుసంఘం ఉపాధ్యక్షుడు మునుకుంట్ల వెంకట్‌రెడ్డి, వేముల రాజు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు రెడీగా ఉన్నరు
చౌటుప్పల్, వెలుగు : కాంగ్రెస్ క్యాండిడేట్ పాల్వాయి స్రవంతిని గెలిపించేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో శనివారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌తోనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
మోటార్లు చోరీ చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
హాలియా, వెలుగు : వ్యవసాయ మోటార్లు చోరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం నల్గొండ జిల్లా త్రిపురారం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నిడమనూరు మండలం గుంటిపల్లి పరిధిలోని జంగాలగూడెం గ్రామానికి చెందిన సిరసల రమేశ్, కండమంచి శేఖర్ కలిసి త్రిపురారం, హాలియా, నిడమనూరు, తిరుమలగిరి, పెద్దవూర, మాడ్గులపల్లి, మిర్యాలగూడ పరిధిలోని పలు గ్రామాల్లో వ్యవసాయ మోటార్లను చోరీ చేస్తున్నారు. వీరు ఇప్పటివరకు 45 మోటార్లను దొంగిలించారు. హాలియాలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పట్టుకొని విచారించగా చోరీ విషయం బయటపడింది. వారిని అదుపులోకి తీసుకొని రూ. 8.57 లక్షల విలువైన 45 మోటార్లు, ఆటో, 2 బైక్‌లు, రూ. 8 వేలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
లారీని ఢీకొట్టిన బైక్, వ్యక్తి మృతి
నార్కట్‌పల్లి, వెలుగు : ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా చిట్యాలలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట పట్టణంలోని చర్చి బజార్‌కు చెందిన జలగం తరుణ్ (24) తన భార్య ప్రవళికతో కలిసి శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్నాడు. మార్గమధ్యలో చిట్యాల వద్దకు రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ తరుణ్ స్పాట్‌లోనే చనిపోగా, ప్రవళికకు గాయలు అయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. మృతిడి తండ్రి విజయ్‌బాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దళితబంధు బాధ్యతను కలెక్టర్లకు ఇవ్వాలి
యాదగిరిగుట్ట, వెలుగు : దళితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఎమ్మెల్యేలకు కాసుల వర్షం కురిపిస్తోందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో శనివారం నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పూర్తిగా కలెక్టర్లకే అప్పగించాలని కోరారు.
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు విరాళం
నల్గొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి రూ. 50 వేల విరాళం ప్రకటించారు. ఈ డబ్బులను శనివారం గ్రామ యువతకు అందజేశారు. - నల్గొండ, వెలుగు
సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌ఏల రాస్తారోకో
హుజూర్‌నగర్, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లాలో శనివారం వీఆర్‌ఏలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్ మెయిన్ రోడ్డులో, నూతనకల్‌లో దంతాలపల్లి – సూర్యాపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేస్కేల్ ఇవ్వడంతో పాటు, అర్హత గల వారికి ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. 55 సంవత్సరాలు నిండిన వీఆర్‌ఏల కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. హుజూర్‌నగర్‌లో వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర కోకన్వీనర్ నరసింహారావు, మండల అధ్యక్షుడు పి.వీరబాబు, చిన్నఈదయ్య, సతీశ్, ఇబ్రహీం, రంజాన్, నాగమ్మ, పాల్గొన్నారు.
ప్రమాదం జరిగితేనే స్పందిస్తరా ?
పెన్‌పహాడ్, వెలుగు : నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో సాగర్ ఎడమ కాల్వకు పడిన గండిని పూడ్చిన ఆఫీసర్లు శిథిలావస్థకు చేరిన మిగిలిన ప్రాంతాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. మంత్రి జగదీశ్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన సూర్యాపేట పరిధిలోని పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ వద్ద సాగర్ ఎడమ కాల్వ లిఫ్ట్ మేజర్ తూము వద్ద కట్ట భారీగా దెబ్బతింది. సీసీ లైనింగ్ కూలిపోవడంతో మట్టి మొత్తం నీటిలో కొట్టుకుపోతోంది. చాలా చోట్ల కట్ట దెబ్బ తినడం, ప్రస్తుతం కాల్వలో నీరు పారుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు స్పందించి ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.