చండూరు, వెలుగు : బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. రజకులు, నాయీ బ్రాహ్మణులతో బుధవారం నల్గొండ జిల్లా చండూరులో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ క్యాండిడేట్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని రజక, నాయీ బ్రాహ్మణులు ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు. కులవృత్తుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ఎన్నో పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. రజకులు, నాయీ బ్రాహ్మణుల షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందజేస్తున్నామని గుర్తు చేశారు. రజకులకు ఆత్మగౌరవ భవనం పేరుతో హైదరాబాద్‌లో 2 ఎకరాల్లో, 5 కోట్ల నిధులు కేటాయించి నట్లు చెప్పారు. ఆయన వెంట కొండూరు సత్యనారాయణ, కోడి వెంకన్న, బూతరాజు మురళి, వెంకన్న, శ్రీను తదితరుపాల్గొన్నారు.
కులవృత్తిని అవమానించిన టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి
చౌటుప్పల్, వెలుగు : కులవృత్తిని, కుల దైవాన్ని అవమానించేలా ప్రవర్తించిన టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్ రావు చెప్పారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో చేనేత కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మగ్గంపై కాళ్లు పెట్టి ఫొటోలకు ఫోజులు ఇస్తూ వృత్తిని అవమానించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మునుగోడులో బీజేపీ క్యాండిడేట్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. నందకుమార్ యాదవ్, రచ్చ శ్రీనివాస్, పిట్టల అశోక్, వనం ధనుంజయ, నేత శ్రీనివాస్ ఉన్నారు.
పనులను ఫాస్ట్‌గా పూర్తి చేయండి
యాదాద్రి, వెలుగు : వివిధ పథకాల కింద మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులను ఫాస్ట్‌గా పూర్తి చేయాలని యాదాద్రి అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. వివిధ పథకాలపై మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లతో బుధవారం కలెక్టరేట్‌లో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ క్రీడా ప్రాంగణాల కోసం స్థలాలను గుర్తించాలని, పట్టణ ప్రకృతి వనాలను, అవెన్యూ ప్లాంటేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని, జంతు సంరక్షణ కేంద్రాల కోసం స్థలాలు గుర్తించాలని సూచించారు. టీఎస్ బీపాస్ కింద వచ్చిన అప్లికేషన్లకు ఇన్‌టైంలో పర్మిషన్ ఇవ్వాలని చెప్పారు. ప్రాపర్టీ ట్యాక్స్‌ను 100 శాతం వసూలు చేసేందుకు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
టీడీపీ హయాంలోనే మునుగోడుకు కృష్ణా జలాలు
మునుగోడు, వెలుగు : మునుగోడు నియోజకవర్గానికి టీడీపీ హయాంలోనే కృష్ణా జలాలు అందాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ చెప్పారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లిలో బుధవారం జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రూ. 147 కోట్ల ఖర్చుతో ఏఎంఆర్ ప్రాజెక్ట్‌గా ద్వారా 506 గ్రామాలకు తాగునీరు అందించామని గుర్తు చేశారు. ఇప్పుడు నియోజకవర్గానికి తామే తాగునీరు ఇచ్చామని టీఆర్‌ఎస్ మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో వేసిన రోడ్లకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం రిపేర్లు చేయలేదని విమర్శించారు. రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామన్న చర్లగూడెం ప్రాజెక్ట్‌ను ఎనిమిదేళ్లు అవుతున్నా ఎందుకు పూర్తి చేయడం లేదని, నిర్వాసితులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోని టీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. టీడీపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో అధికార ప్రతినిధి మక్కెన అప్పారావు, మునుగోడు పట్టణ అధ్యక్షుడు సింగం గిరిధర్, నాయకులు పొడపంగి సైదులు, ఇటికలపాటి ఆరోగ్యం, మొగుదాల లక్ష్మీనారాయణ, అంతోని యాదయ్య, నెట్టు శ్రీకాంత్, బొడ్డుపల్లి సత్తయ్య పాల్గొన్నారు.
బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తే సహించం
చండూరు, వెలుగు : బీజేపీ కార్యకర్తలను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అలాంటి చర్యలను సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే ధర్మారావు హెచ్చరించారు. నల్గొండ జిల్లా చండూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ తమ స్థాయి దిగజార్చుకుంటున్నారన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపైకి పోలీసులను ఉసిగొల్పి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న పోలీసులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చండూరులో జరిగిన ఘటనపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆయన వెంట దోటి వెంకటేశ్, కోడి శ్రీనివాసులు, రామోజీ నామోజీ, శ్రీకాంత్‌గౌడ్ ఉన్నారు.