రాతి పెల్లలు పడి వలస కూలీ మృతి

  • మరో ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలు
  • సుంకిశాల పంప్​హౌస్ ​పనుల్లో ప్రమాదం

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పాల్తీ తండా సమీపంలో నిర్మాణంలో ఉన్న సుంకిశాల పంప్​హౌస్ వద్ద శుక్రవారం ప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న రాతి పెల్లలు విరిగి పడడంతో ఓ వలస కూలీ మృతి చెందాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దవూర ఎస్సై అజ్మీరా రమేశ్ ​తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ కు చెందిన అజయ్ ఠాగూర్, రబీముడి, రాహుల్ కుమార్, కార్తీక్ మాలిక్, గత్తు మాలిక్, బికాస్ కర్మాకర్(20) కొంత కాలంగా సుంకిశాల పంప్​హౌస్ నిర్మాణ పనులకు వెళ్తున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు పనుల్లో నిమగ్నమైన కార్మికులపై పక్కనే ఉన్న కొండ నుంచి రాతి పెల్లలు విరిగి పడ్డాయి.

 ఈ ప్రమాదంలో బికాస్​కర్మాకర్ చనిపోయాడు. అజయ్ ఠాకూర్, రబి ముడి, రాహుల్ కుమార్, కార్తీక్ మాలిక్, గత్తు మాలిక్ లు తీవ్రంగా గాయపడ్డారు. తోటి కార్మికులు వారిని హుటాహుటిన నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. మృతుడి స్నేహితుడు పవన్ సింగ్ సర్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.