
నల్లగొండ జిల్లా, గుర్రంపోడు తహసీల్దార్ జి. కిరణ్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా, జిల్లా యంత్రాంగం ఆదేశాలను బేఖాతరు చేసినందుకుగానూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తహసీల్దార్ కిరణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్.. గత నెల జనవరి 6 నుండి 16 వరకు ఆయనకు సెలవులు మంజూరు చేశారు. ఆ గడువు ముగినప్పటికీ, తహసీల్దార్ విధులకు హాజరవ్వలేదు. ఆ సెలవులను జనవరి 31 వరకు పొడిగించారు. ఆ తదుపరి మరోసారి ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 28 వరకు సెలవులను పొడిగించారు.
అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం, రేషన్ కార్డులు, రైతు భరోసా తదితర పథకాల కింద లబ్ధిదారుల ఎంపికతో పాటు.. కేంద్ర ఎన్నికల సంఘం వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్.. తహసీల్దార్ విజ్ఞప్తిని తోసిపుచ్చారు.. సెలవును మంజూరు చేయలేదు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వెంటనే విధుల్లో చేరాలని తహసీల్దార్‌ను కోరారు. అయినప్పటికీ, ఆయనవిధుల్లో చేరకపోగా.. పై అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.. స్పందించనూ లేదు.
దాంతో, ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా యంత్రాంగానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నందున సెలవులో ఉన్న గుర్రంపొడు తహసీల్దార్ జి. కిరణ్ కుమార్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు. తహసీల్దార్ కిరణ్ కుమార్ ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానం వదిలి వెళ్ళకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.