ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

సూర్యాపేట పట్టణంలో జనజీవనం  అస్తవ్యస్తం

సూర్యాపేట, వెలుగు: జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి  జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గంటల తరబడి తెరపివ్వకుండా వాన పడడంతో పట్టణంలోని కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.  గ్రామాల్లో వాగులు పొంగి చెరువులు అలుగులు పోయడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్​ అయ్యాయి. పట్టణంలోని 60 ఫీట్ రోడ్డు ఎగువ భాగం నుంచి వరద  పెరగడంతో నాలా ఉప్పొంగి.. చుట్టుపక్కల వార్డుల ప్రజలు అవస్థలు పడ్డారు.

నీట మునిగిన కాలనీలు

పట్టణంలోని 60 ఫీట్ రోడ్డు, శ్రీనివాస కాలనీ, చర్చి కాంపౌండ్, విద్యానగర్, మూవీ మ్యాక్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా వరద నీరు ఇండ్లలోకి చేరింది.

గ్రామాలకు రాకపోకలు బంద్
మునగాల మండలం గణపవరం వద్ద  చెరువు ఉధృతంగా అలుగు పోస్తుండటంతో 15 గ్రామాలకు రాకపోకలు బంద్​ అయ్యాయి. నడిగూడెంలోని చెరువు అలుగుపోయడంతో ఎస్సీ కాలనీ పూర్తిగా జలమయమైంది. మునగాల మండలం తాడువాయి గురప్ప వాగు పొంగి ప్రవహిస్తుండటంతో సుమారు 7 గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 9. 34 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

మునుగోడులో బీజేపీ జెండా ఎగరడం ఖాయం

చండూరు (మర్రిగూడ) వెలుగు: మునుగోడులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం మర్రిగూడలోని బీజేపీ ఆఫీస్​లో శక్తి కేంద్రాల ఇన్​చార్జిలు, బూత్ కమిటీ మెంబర్ల మీటింగ్​కు హాజరై మాట్లాడారు. తాను  మూడు రోజులుగా పర్యటిస్తున్నానని, రాజగోపాల్ రెడ్డి రాజీనామా తోనే  తమకు కొత్తగా పింఛన్లు, రోడ్లు, నిర్వాసితులకు ప్యాకేజీ, బర్లు, గొర్లకు లోన్లు వస్తున్నాయని చెప్తున్నారన్నారు.

ప్రజల్లో రాజగోపాల్​రెడ్డికి ఉన్న ఆదరణ చూస్తే గెలుపు ఖాయంగా కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  మునుగోడు  రాష్ట్ర వ్యాప్తంగా తెలియని నియోజక వర్గం కాగా, రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో, దేశవ్యాప్తంగా మునుగోడు ప్రజల ‘గోడును’ చూస్తున్నారని చెప్పారు. మునుగోడు తీర్పుతోనే రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుందని, కేసీఆర్​కుటుంబ పాలన అంతమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జడ్పీ మాజీ చైర్​పర్సన్​తుల ఉమా, యాస అమరేందర్ రెడ్డి, పిట్టల శ్రీను, రాజేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

రూ.11లక్షలు రికవరీ

మిర్యాలగూడ, వెలుగు :  బైక్ పై నుంచి డబ్బుల సంచి జారి పడిపోయిన ఘటనలో.. అందులో ఉన్న రూ. 11లక్షల నగదు ను గురువారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు రికవరీ చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర రావు వివరాల ప్రకారం...ఈ నెల 27 రాత్రి మంచుకొండ జగదీశ్ అనే వ్యాపారి షాబు నగర్ నుంచి హౌసింగ్​బోర్డు వెళ్తుండగా ఎస్బీఐ ఎదురుగా  అతని బైక్ నుంచి డబ్బు సంచి జారి పడింది. పోస్ట్ ఆఫీస్ వద్దకు వెళ్లి చూడగా డబ్బు సంచి కనపడలేదు.

దీంతో వన్ టౌన్ పోలీసులకు కంప్లైంట్​చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆలగడప కి చెందిన ఇంద్రపల్లి వెంకటేశ్వర్లు అనే ఆటో డ్రైవర్​ డబ్బు సంచి తీసినట్లు గుర్తించారు.  అతడిని పట్టుకుని విచారించగా.. డబ్బుల సంచి దొరకడంతో ఇంటికి తీసుకెళ్లి దాచుకున్నట్లు ఒప్పుకున్నాడు.  వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేసిన పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా కేసును చేధించిన సీఐ రాఘవేందర్​, ఎస్సై సుధీర్​కుమార్​, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 

పింఛన్​ ఇస్తలేరని దివ్యాంగుల భిక్షాటన

మునగాల(మోతె), వెలుగు :  ఆసరా పింఛన్లు సకాలంలో పంపిణీ చేయక పోవడాన్ని నిరసిస్తూ భారత  దివ్యాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్​ఆధ్వర్యంలో గురువారం మోతె మండల కేంద్రంలో దివ్యాంగులు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెలాఖరు వచ్చినా  పింఛన్లు  పంపిణీ చేయకపోవడంతో.. లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.  సకాలంలో  పింఛన్లు రాక అనారోగ్యంతో బాధపడుతున్న దివ్యాంగులు మందులు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. వెంటనే పింఛన్లు ఇవ్వాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.  సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు మున్న మధు యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ​సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీ గెలిస్తేనే అవినీతి పాలన అంతం

చండూరు, వెలుగు: మునుగోడు బైఎలక్షన్స్​లో బీజేపీ గెలుపుతోనే రాష్ట్రంలో అవినీతి పాలన అంతమవుతుందని మాజీ ఎమ్మెల్యే , బీజేపీ నేత టి.నందీశ్వర్ గౌడ్ అన్నారు. గురువారం చండూరులో  బీజేపీ ఏర్పాటు చేసిన శక్తి కేంద్రాల ఇన్​చార్జిలు, బూత్​కమిటీల నాయకుల మీటింగ్​కు రాష్ట్ర నాయకుడు అందె బాబయ్యతో కలిసి  నందీశ్వర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయని కలలుగన్న నిరుద్యోగుల కలలు కేసీఆర్​కల్లలు చేశారని మండిపడ్డారు.

నియంత పాలన చేస్తున్న కేసీఆర్​ను గద్దె దింపాలంటే మునుగోడు గెలుపుతోనే బీజం వేయాలన్నారు.  ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగితే  టీఆర్ఎస్​కు మూడో స్థానం వస్తుందన్నారు. ఎనిమిదేళ్ల కాలంలో దోచుకున్న డబ్బును పంచి గెలిచేందుకు కేసీఆర్​ఎత్తులు వేస్తున్నారన్నారు.  ఈ మీటింగ్​లో జిల్లా ఉపాధ్యక్షుడు కోమటి వీరేశం,కాసాల జనార్దన్ రెడ్డి, పల్లె వెంకన్న, నకిరేకంటి లింగస్వామి, పిన్నింటి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే భూమి కోసం అలైన్​మెంట్ మార్పించిండు

యాదాద్రి, వెలుగు: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి  తన భూమిని కాపాడుకునేందుకే.. ట్రిపుల్​ఆర్​అలైన్​మెంట్​మార్పించారని యాదాద్రి డీసీసీ  ప్రెసిడెంట్​కుంభం అనిల్ కుమార్​రెడ్డి ఆరోపించారు. మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న ట్రిపుల్​ఆర్​బాధితులను అరెస్ట్​ చేసిన పోలీసులు భువనగిరి రూరల్​పీఎస్​కు తరలించారు. విషయం తెలుసుకున్న అనిల్​కుమార్​రెడ్డి  పీఎస్​కు వెళ్లి బాధితులను కలిసి మాట్లాడారు. ఎమ్మెల్యేగా తన పవర్​ ఉపయోగించుకుని శేఖర్​రెడ్డి  లబ్ధి పొందుతూ పేద ప్రజలకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే  3 సార్లు భూమిని తీసుకున్న ప్రభుత్వం.. మళ్లోసారి తీసుకోవడం అన్యాయమన్నారు. వెంటనే అలైన్​మెంట్​ మార్చాలని డిమాండ్​ చేశారు.  ట్రిపుల్​ ఆర్​ బాధితులకు న్యాయం జరిగేంత వరకూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.  

కారు, బైక్ ఢీకొని వ్యక్తి మృతి..మరొకరి పరిస్థితి విషమం

తుంగతుర్తి, వెలుగు: మండల పరిధిలోని రావులపల్లి ఎక్స్​రోడ్డు వద్ద గురువారం కారు, బైక్ ఢీకొని ఒకరు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై డానియల్​వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామ పరిధిలోని చిట్టి సముద్రం తండాకు చెందిన ధరావత్ రాజ్ కుమార్(27), ఫ్రెండ్​తో కలిసి తుంగతుర్తి మండలం ఏనాకుంట తండాలో బంధువుల ఇంటికి బైక్​పై వెళ్లారు. తిరిగి వెళ్తుండగా.. రావులపల్లి ఎక్స్ రోడ్డు దాటిన తర్వాత వీరి బైక్​అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో బైక్​వెనుక కూర్చున్న రాజ్​కుమార్​ఎగిరిపడి స్పాట్​లోనే చనిపోయాడు. బైక్​నడుపుతున్న సుమన్​తీవ్రంగా గాయపడడంతో స్థానికులు చికిత్స కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

మహిళలను పట్టించుకోని గత పాలకులు

నెట్​వర్క్​, వెలుగు: తెలంగాణలో ఘనంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగను మహిళలందరూ సంతోషంగా జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ చీరల పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు గొంగిడి సునీత,  రవీంద్ర కుమార్​, బొల్లం మల్లయ్య యాదవ్​, శానంపూడి సైదిరెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్​రెడ్డి అన్నారు. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వారి వారి నియోజకవర్గాల పరిధిలో  బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ పాలకుడు కూడా మహిళా సంక్షేమం పట్టించుకోలేదన్నారు.  

ఘనంగా అట్ల బతుకమ్మ

ప్రభుత్వం నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో భాగంగా గురువారం నల్గొండ ఎన్జీ కాలేజీ గ్రౌండ్​లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీ , ముఖ్య ప్రణాళిక, ఆర్టీసీ, మెప్మా శాఖల ఉద్యోగినులు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా  డీఆర్డీవో పీడీ కాళిందిని ఇతర జిల్లా అధికారులు బతుకమ్మలను ఎత్తుకున్నారు. – ఫొటోగ్రాఫర్​, వెలుగు

యాక్సిడెంట్​లో యువకుడి మృతి

దేవరకొండ, వెలుగు:  పట్టణ శివారులోని సాయిబాబా ఆలయం దగ్గరలో  బుధవారం రాత్రి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్​ఢీకొట్డంతో ఓ వ్యక్తి స్పాట్​లోనే చనిపోయాడు. సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం..  దేవరకొండ మండలం శాఖెల్లి గ్రామానికి చెందిన నీలం అశోక్​(22) అనే యువకుడు ఆరోగ్యం బాగా లేకపోవడంతో తన బైక్​పై దేవరకొండకు వచ్చి ఓ ప్రైవేట్​ఆస్పత్రిలో చూపించుకుని  ఇంటికి వెళ్తుండగా.. లారీని ఢీకొట్టాడు. తండ్రి సాలయ్య కంప్లైంట్​మేరకు కేసు ఫైల్​చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు  సీఐ తెలిపారు.

దేవరకొండలో ప్రైవేట్​ ఆస్పత్రుల తనిఖీ

దేవరకొండ, వెలుగు: దేవరకొండ పట్టణంలోని పలు ప్రైవేట్​ఆస్పత్రులను  డీఎంహెచ్​వో  కొండల్​రావు గురువారం తనిఖీ చేశారు. రూల్స్​కు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు ల్యాబ్​లు, స్కానింగ్​ సెంటర్లను గుర్తించి సీజ్​ చేశారు. సాయి బాలాజీ స్కానింగ్​ సెంటర్​ను , వినాయక కార్డియాక్​ సెంటర్ లో డాక్టర్​కు   అర్హత లేకున్నా..   టెస్టులు చేస్తున్నట్లు గుర్తించి మెషీన్​ను సీజ్​చేశారు.  కొన్ని ల్యాబ్​లలో అర్హతలేని టెక్నీషియన్లు పని చేస్తున్నారని గుర్తించిన ఆయన డాక్టర్లను హెచ్చరించారు.  ఆర్​ఎంపీలు తమ స్థాయికి మించి వైద్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంవో రవిశంకర్, దేవరకొండ డిప్యూటీ డీఎంహెచ్​వో కృష్ణకుమారి, వైద్య సిబ్బంది ఉన్నారు.

రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

చౌటుప్పల్, వెలుగు: రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి  అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చీకోటి విజయలక్ష్మి ఫంక్షన్ హాల్లో  లింగోజిగూడెం, తాళ్లసింగారం, లింగారెడ్డిగూడెం శక్తి కేంద్రాల, బూత్ కమిటీ మెంబర్ల మీటింగ్​నిర్వహించారు. హాజరైన ప్రకాశ్​రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని  భారీ మెజార్టీతో గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఈజీ అవుతుందన్నారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో హైదరాబాద్​మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జీ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ గోని శంకర్,  ఊడుగు వెంకటేశ్ గౌడ్, కడారి ఐలయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఆందోల్ మైసమ్మ ఆలయ హుండీ లెక్కింపు

చౌటుప్పల్, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ పరిధిలో గల ఆందోల్ మైసమ్మ ఆలయ హుండీ లెక్కింపును గురువారం ఆలయ అధికారులు నిర్వహించారు.  53 రోజులకు గాను రూ.5,19,904  ఆదాయం వచ్చినట్లు ఆలయ  ఈవో చిట్టెడి వెంకట్ రెడ్డి, చైర్మన్ సిద్దిపేట శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఎండోమెంట్​అసిస్టెంట్ కమిషనర్ నిఖిల్, దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

పోడు భూములపై జేసీ​ రివ్యూ

మేళ్లచెరువు, వెలుగు: ఉమ్మడి మేళ్లచెరువు మండలంలోని పోడు భూముల పంపిణీ కోసం గురువారం మేళ్లచెరువులో జేసీ మోహన్ రావు, చింతలపాలెంలో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ శంకర్  అధికారులతో రివ్యూ నిర్వహించారు.  మండలంలోని పోడు భూమి విస్తీర్ణ వివరాలు, అప్లికేషన్లను పరిశీలించారు. కాగా చింతలపాలెం లో అటవీ భూమి అన్యాక్రాంతమవుతోందని , పేదలకు పంపిణీ చేయాలని సర్పంచ్ ఆయేషా అమీర్ సాబ్ ఆఫీసర్లను డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ హద్దులు కూడా లేవని అన్నారు. త్వరలోనే హద్దులు నిర్ణయించి పంపిణీ చేస్తామని ఆఫీసర్లు హామీ ఇచ్చారు. తహసీల్దార్లు దామోదర్ రావు, సచిన్ చంద్ర తివారీ, ఎంపీడీవోలు ఇషాక్ హుస్సేన్, గ్యామానాయక్ పాల్గొన్నారు.

టూరిజం స్పాట్ గా యాదగిరిగుట్ట
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

యాదగిరిగుట్ట/యాదాద్రి, వెలుగు: యాదగిరిగుట్ట రానున్న రోజుల్లో ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు గొప్ప టూరిజం ప్లేస్​గా మారబోతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ అన్నారు. గురువారం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని  ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాదగిరి గుట్ట పునఃప్రారంభమైన తర్వాత స్వామివారిని దర్శించుకునే వారి సంఖ్య భారీగా పెరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

రానున్న రోజుల్లో బస్వాపూర్, యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దుతామన్నారు. అంతకు ముందు అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం, స్వామివారి శేష వస్త్రాలు మంత్రికి అందజేశారు. అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఆలయ డిఫ్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ తదితరులు  పాల్గొన్నారు. 

అడవులను 4 శాతం పెంచినం

అడవులకు పునర్జీవన కార్యక్రమాన్ని స్పీడప్​చేస్తున్నామని అటవీ శాఖ మంత్రి ఏ ఇంద్రకరణ్​రెడ్డి  తెలిపారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో మంత్రి జగదీశ్​రెడ్డితో కలిసి రూ. 3.50 కోట్లతో నిర్మించిన ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ ఆఫీస్​ కాంప్లెక్స్​ ప్రారంభించి  మాట్లాడారు. ‘హరిత హారం’లో భాగంగా రాష్ట్రంలో 15 వేల నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచడం, అందుకు అనుగుణంగా మొక్కలు నాటుతున్నామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 249 కోట్ల మొక్కలు నాటి వాటిలో 80 శాతం సంరక్షించామని తెలిపారు. రాష్ట్రంలో 24 శాతం అడవుల శాతం ఉండగా ఇప్పటి వరకు నాలుగు శాతం పెంచామన్నారు. అనంతరం ఆఫీస్​ఆవరణలో మంత్రులు మొక్కలు నాటారు. జడ్పీ చైర్మన్​ఎలిమినేటి సందీప్​రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్​, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఆయిల్​ ఫెడ్​ చైర్మన్ రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. 

అలిగిన భువనగిరి ఎమ్మెల్యే

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి మంత్రి జగదీశ్​రెడ్డిపై అలిగారు. ఫారెస్ట్​ఆఫీస్​ఓపెనింగ్​సమయంలో మంత్రితో అంటీముట్టనట్లు వ్యవహరించారు. ఫారెస్ట్​ఆఫీస్​ఓపెనింగ్​ ఇన్విటేషన్​ కార్డులో తనపేరు ప్రింట్​ చేయలేదని అసహనానికి గురయ్యారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న ప్రోగ్రాంలో  పేరు లేకపోవడం అవమానంగా ఉందని, తాను కార్యక్రమానికి రానని చెప్పినట్లు టీఆర్​ఎస్​ లీడర్లు తెలిపారు. దీంతో   మంత్రి జగదీశ్​రెడ్డి ఎమ్మెల్యేను బుజ్జగించడంతో కార్యక్రమానికి వచ్చినా .. ఆయన ముభావంగానే ఉన్నారు.  

‘గుట్ట’ ఎంప్లాయీస్ ఇండ్ల స్థలాలపై  రివ్యూ

యాదాద్రి, వెలుగు: యాదగిరిగుట్ట దేవస్థానంలో పనిచేసే  ఎంప్లాయీస్​కు ఇండ్ల స్థలాల గురించి యాదాద్రి కలెక్టరేట్​లో  మంత్రులు  ఇంద్రకరణ్​రెడ్డి, జగదీశ్​రెడ్డి ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​నిర్వహించారు.  దేవస్థానంలో ఎంత మంది ఎంప్లాయీస్​, ఎంత స్థలం,  ఎక్కడ ఉన్నది అన్న విషయాలపై ఆరా తీశారు. టెంపుల్​ఈవో గీతారెడ్డి వైటీడీఏ  పరిధిలో ఉన్న ఖాళీ స్థలాల వివరాలను  మంత్రులకు వివరించారు. పర్మినెంట్​ఎంప్లాయీస్​, ఎన్​ఎంఆర్, కాంట్రాక్ట్​, అవుట్​ సోర్సింగ్​ఎంప్లాయీస్  అంతా 400 మందికి పైగా ఉంటారని తెలిపారు. ఇప్పటికే గుట్ట విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి సైదాపురం రెవెన్యూలోని 329, 320 సర్వేనంబర్లలో  ఇండ్ల స్థలాలు ఇచ్చామని ఈవో చెప్పారు.

ఎమ్మెల్యే భూమి కోసం అలైన్​మెంట్ మార్పించిండు

యాదాద్రి, వెలుగు: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి  తన భూమిని కాపాడుకునేందుకే.. ట్రిపుల్​ఆర్​అలైన్​మెంట్​మార్పించారని యాదాద్రి డీసీసీ  ప్రెసిడెంట్​కుంభం అనిల్ కుమార్​రెడ్డి ఆరోపించారు. మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న ట్రిపుల్​ఆర్​బాధితులను అరెస్ట్​ చేసిన పోలీసులు భువనగిరి రూరల్​పీఎస్​కు తరలించారు. విషయం తెలుసుకున్న అనిల్​కుమార్​రెడ్డి  పీఎస్​కు వెళ్లి బాధితులను కలిసి మాట్లాడారు. ఎమ్మెల్యేగా తన పవర్​ ఉపయోగించుకుని శేఖర్​రెడ్డి  లబ్ధి పొందుతూ పేద ప్రజలకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే  3 సార్లు భూమిని తీసుకున్న ప్రభుత్వం.. మళ్లోసారి తీసుకోవడం అన్యాయమన్నారు. వెంటనే అలైన్​మెంట్​ మార్చాలని డిమాండ్​ చేశారు.  ట్రిపుల్​ ఆర్​ బాధితులకు న్యాయం జరిగేంత వరకూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.