పోలీస్ పహారా మధ్య ఉట్లపల్లి వీఆర్ఏ అంత్యక్రియలు

  • బందోబస్తులో 150 మందికి పైగా పోలీసులు 

మిర్యాలగూడ, వెలుగు: ఆత్మహత్య చేసుకున్న నల్గొండ జిల్లా ఉట్లపల్లి వీఆర్ఏ కంచర్ల వెంకటేశ్వర్లు అంత్యక్రియలు ఆదివారం పోలీస్ పహారా మధ్య ముగిశాయి. అంతిమయాత్రలో పాల్గొనేందుకు వీఆర్ఏలు రావాలని స్టేట్ జేఏసీ పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 150 మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఉట్లపల్లికి వచ్చే మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జేఏసీ పిలుపు మేరకు వరంగల్​, ఖమ్మం, సూర్యాపేట తదితర జిల్లాల నుంచి పెద్దఎత్తున వీఆర్ఏలు తరలివచ్చారు. అయితే వారిలో కొంతమందిని పోలీసులు వాడపల్లికి తరలించారు. వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధి సోమన్న ఉట్లపల్లికి చేరుకొని బాధిత ఫ్యామిలీని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని నెలన్నరగా సమ్మె చేస్తూ 29 మంది వీఆర్ఏలు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.

వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన కేసీఆర్.. వీఆర్ఏలు సమ్మె చేస్తున్నా స్పందించడం లేదన్నారు. వీఆర్ఏల చావులకు కేసీఆరే బాధ్యుడని అన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, వీఆర్ఏ జేఏసీ రాష్ర్ట నేత దాదేమియా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా కారణంగానే వీఆర్ఏలు చనిపోతున్నారని దాదేమియా అన్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.