మోతాదుకు మించి ఇథిలిన్ వాడితే చర్యలు

సూర్యాపేట, వెలుగు: గర్నమెంట్​రూల్స్​ ప్రకారం మోతాదుకు మించి ఇథిలిన్ వాడితే చట్టపర చర్యలు తీసుకుంటామని ఫుడ్​సేఫ్టీ ఆఫీసర్​డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మామిడి మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ.. సహజసిద్ధంగానే మామిడిపండ్లను మగ్గ బెట్టాలని పేర్కొన్నారు. సీజన్ ప్రారంభానికి ముందే వ్యాపారస్తులకు ఇథిలిన్ వినియోగంపై అవగాహన కల్పించమన్నారు. ఆదేశాలు ఇచ్చినా కొంతమంది మామిడి పండ్ల మధ్యలో నేరుగా ఇథిలిన్​వాడుతున్నట్లు గుర్తించామన్నారు. టెస్టింగ్​కోసం పండ్లను ల్యాబ్​కు పంపామని, రిపోర్ట్ ఆధారంగా కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లా కేంద్రంతో పాటు కోదాడ పరిసర ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఇన్​చార్జి కృష్ణమూర్తి, ఖాజా లతీఫ్, సిబ్బంది పాల్గొన్నారు.