బీఆర్ఎస్​లో గుత్తాకు పొగ! ఎమ్మెల్యే జగదీశ్​ వర్సెస్​ మండలి చైర్మన్​ సుఖేందర్​రెడ్డి

  •   నల్గొండ జిల్లాలో ఇరు వర్గాల మధ్య తారస్థాయికి చేరిన విభేదాలు
  •     గుత్తా కొడుకు అమిత్ పొలిటికల్​ ఎంట్రీకి జగదీశ్​ వర్గీయుల అడ్డుపుల్ల
  •     నల్గొండ, భువనగిరి స్థానాల్లో అమిత్​కు వ్యతిరేకంగా తెరపైకి కొత్త పేర్లు
  •     హైకమాండ్​తో తాడోపేడో తేల్చుకునే పనిలో సుఖేందర్​రెడ్డి

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డికి సొంత పార్టీ నేతలే పొగ పెడుతున్నారు. గుత్తా తన కొడుకు అమిత్​రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను పార్టీలోని ఓ బలమైన వర్గం మొదటి నుంచీ అడ్డుకుంటోంది.  మునుగోడు బైపోల్స్, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, తీరా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోనూ అమిత్​పొలిటికల్ ఎంట్రీకి మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి అడ్డుగోడగా మారిన తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మునుగోడు బై పోల్స్​ నుంచే.. 

మునుగోడు ఉప ఎన్నికల్లోనే తన కొడుకు అమిత్​ను రంగంలోకి దించాలని సుఖేందర్​రెడ్డి భావించారు. కానీ జగదీశ్​రెడ్డి సహా ఆయన వర్గానికి చెందిన అప్పటి ఎమ్మెల్యేలు అమిత్​కు వ్యతిరేకంగా హైకమాండ్​వద్ద పావులు కదిపి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డిని బరిలో నిలిపారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ, మునుగోడు సీట్లలో ఏదో ఒకటి తనకు వస్తుందని అమిత్​ఆశించారు. అప్పటి పరిస్థితుల్లో అభ్యర్థులను మార్చే జాబితాలో మునుగోడు కూడా ఉండడం, ఆ సీటు ఎలాగైనా అమిత్​కు ఇస్తానని స్వయంగా కేటీఆర్ హామీ ఇవ్వడంతో అమిత్​మునుగోడు రాజకీయాల్లో యాక్టివ్​రోల్​పో షించారు. కానీ హైకమాండ్​ సిట్టింగులకే మళ్లీ అవకాశం ఇవ్వడంతో అమిత్​కు మరోసారి నిరాశే ఎదురైంది. అసెంబ్లీ సీటు ఇవ్వనందున ఎంపీ​ సీటు కచ్చితంగా ఇస్తామని అప్పట్లో హైకమాండ్​హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. 

ఎంపీ టికెట్​ దక్కకుండా..

నల్గొండ ఎంపీగా రెండు సార్లు పనిచేసిన అనుభవంతో తన కొడుకు అమిత్​ను ఇక్కడి నుంచి బరిలో దింపాలని సుఖేందర్​రెడ్డి భావిస్తున్నారు. కానీ  మాజీ మంత్రి జగదీశ్​సహా ఆయన వర్గానికి చెందిన హుజూర్​నగర్​, నల్గొండ, దేవరకొండ మాజీ ఎమ్మెల్యేలు అమిత్​అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. గుత్తాకు వ్యతిరేకంగా కొత్త నాయకులను జగదీశ్​వర్గం ఎగదోస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే నల్గొండ లోక్​సభ స్థానానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి అన్న కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, హుజూర్​నగర్​ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేర్లను ఆ వర్గం తెరపైకి తెచ్చింది.

ఇది చాలదన్నట్లు నల్గొండ ఎంపీ సీటును అయితే బీసీలకు, లేదంటే ఎస్టీలకు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని జగదీశ్​రెడ్డి స్వయంగా చెప్పడం మరింత వేడి పుట్టించింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యేల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన సుఖేందర్​రెడ్డి హైకమాండ్​ను కలిసి నల్గొండ కుదరకపోతే భువనగిరి నుంచైనా తన కొడుక్కి ఛాన్స్ ఇవ్వాలని కోరారు. కానీ అక్కడ కూడా జగదీశ్​వర్గం మరో మాజీ ఎమ్మెల్యే శేఖర్​రెడ్డి పేరును తెరపైకి తెచ్చింది. మునుగోడు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్​కుమార్​, కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డిని కలిసి శేఖర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరింది. ఒకవేళ శేఖర్ రెడ్డి ఒప్పుకోకపోతే బీసీ కోటాలో పొన్నాల లక్ష్మయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్ లో ఎవరో ఒకరిని దింపాలని జగదీశ్​ వర్గం ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

హైకమాండ్​కు ఫిర్యాదుతో గుత్తా వర్గీయులు ఫైర్

తాజాగా అమిత్​రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని జగదీశ్, ఆయన వర్గం ఎమ్మెల్యేలంతా హైకమాండ్​కు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. గుత్తా.. జిల్లాలో గ్రూపు రాజకీయాలను పెంచిపోషిస్తున్నాడని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు నల్గొండ, దేవరకొండ, మునుగోడు, హుజూర్​నగర్​నియోజకవర్గాల్లో తన క్యాడర్​మొత్తాన్ని గంపగుత్తగా కాంగ్రెస్​లో చేర్పించి తమ ఓటమికి కారణమయ్యారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

ఈ విషయం తెలిసి గుత్తా వర్గీయులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. కాంగ్రెస్​నుంచి బీఆర్ఎస్​లో చేరినప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలో పార్టీ పటిష్టతకు గుత్తా ఎంతో కష్టపడ్డారని అంటున్నారు. హుజూర్​నగర్​, నాగార్జునసాగర్​, మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారని, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థుల గెలుపు కోసం ఆర్థిక సాయం కూడా చేశారని చెబుతున్నారు. ఇటీవల దేవరకొండ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్​ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు  కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమైతే వారిని వారించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. జగదీశ్​వర్గానికి హైకమాండ్​తలొగ్గి, తన కొడుకుకు టికెట్​నిరాకరిస్తుందోననే భయం గుత్తాను వెంటాడుతోంది. దీంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఆయన రెడీ అవుతున్నారు. తాజాగా మంగళవారం జరిగిన ప్రెస్​మీట్​లో హైకమాండ్​ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా గెలుపు గుర్రాలకే టికెట్​ ఇవ్వాలని కామెంట్​చేయడం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.