నల్గొండ అర్బన్ వెలుగు : నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. స్టోర్ రూంలో బాత్రూం క్లీన్ చేసే సల్ప్యూ రిక్ ఆసిడ్ బ్లీచింగ్ పౌడర్ తో కలవడంతో పొగలు వచ్చాయి. కొద్దిగా మంటలు చెలరేగి దవాఖాన ప్రాంగణమంతా పొగలు అలుముకోవడంతో భయపడిన బాలింతలు, అటెండర్లు పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో దవాఖానలో సుమారు రెండు వందల మంది బాలింతలు, పిల్లలు ఉండగా, అటెండర్లు , సిబ్బంది మరో వంద మంది వరకు ఉన్నారు.
దట్టంగా పొగ కమ్మడంతో ఎంసీహెచ్లోని కొన్ని వార్డుల్లో రోగులు ఊపిరాడక కిటికీ అద్దాలు పగలగొట్టారు. సిబ్బంది, ఇతర రోగులు, వారి బంధువులు స్టోర్ రూమ్ లో మంటలు, పొగ ఆర్పేశారు. తర్వాత వచ్చిన అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సుమారు 5 గంటల పాటు బాలింతలు తమ పిల్లలతో బయటనే ఉండిపోయారు. కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ దవాఖానకు వచ్చి సూపరింటెండెంట్ లచ్చుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరగలేదని, ఎవరికి ఎలాంటి హాని కలగలేదన్నారు. ప్రమాదం జరిగిన స్టోర్ రూంను కలెక్టర్పరిశీలించారు. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దవాఖానకు చేరుకుని వివరాలడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్వో డా.కొండల్ రావు ఉన్నారు.