నల్గొండ, వెలుగు: జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆమెపై సిబ్బంది ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ఎస్పీ తమను నుంచి భారీగా వసూళ్లు చేశారని ఆ శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్ కోసం లంచం తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు.
అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించారని తెలిపారు. అధికారులు విచారణలో గంజి కవిత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారిగా ఆమె ఏడేండ్లు పని చేశారు. ఈ కాలంలో రేషన్, గుట్కా మాఫియా నుంచి ఆమె భారీగా డబ్బు వసూళ్లు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఎస్ఐతోపాటు నలుగురు కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా నడిచిపించినట్లు సమాచారం. దీంతో ఆమె షాడో టీంపై కూడా విచారణ చేపట్టగా, ఇందులో ముగ్గురు ఇంటెలిజెన్స్ కానిస్టేబుళ్లను వీఆర్ కు అటాచ్ చేశారు. ఆమె స్థానంలో నల్గొండ ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.