నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును అధిష్టానం ప్రకటించింది. ఈ స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2021 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు పదవీకాలం ఉంది. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి డిసెంబరు 9న రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఈసీ ఈ స్థానానికి ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. త్వరలోనే ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును ప్రకటించింది.
ఇక మరోవైపు తెలంగాణలో మిగిలిన మూడు లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, ఖమ్మం నుంచి రామసహాయం రఘురామ రెడ్డి, హైదరాబాద్ నుంచి మహమ్మద్ సమీర్ పేర్లను ఖరారు చేసింది. ఎన్నికల నామినేషన్ కు రేపటికి చివరి తేదీ కావడంతో అభ్యర్థులను ప్రకటించింది అధిష్టానం. అయితే అధిష్టానం ప్రకటించకముందే కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, ఖమ్మం నుంచి రామసహాయం రఘురామ్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.