కూతురితో అల్లుడు కలిసుండేందుకు మర్డర్  

కూతురితో అల్లుడు కలిసుండేందుకు మర్డర్  
  • నల్గొండలో దృశ్యం సినిమాను తలపించిన ఘటన  
  • కలర్ ల్యాబ్ ఓనర్ హత్య కేసులో నలుగురు అరెస్ట్ 
  • కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండలో ల్యాబ్ ఓనర్ హత్య కేసు మిస్టరీ వీడింది. బంధువే ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బుధవారం జిల్లా పోలీస్ ఆఫీసులో ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. నకిరేకల్ కు చెందిన రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ మాతారి వెంకటయ్య తన కూతురు ఉమామ హేశ్వరిని 2017లో అదే టౌన్ కు చెందిన గద్దపాటి నరేశ్ కు ఇచ్చి పెండ్లి చేశాడు. 

కొన్నాళ్లకు నరేశ్ మరో  మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను వేధించసాగాడు. దంపతుల మధ్య గొడవలు ముదిరి కోర్టుకు చేరాయి.  నరేశ్​అన్న సురేశ్​కు కూడా మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, తమ్ముడిని కూడా అతడే ప్రోత్సహించాడని వెంకటయ్య, ఉమామహేశ్వరి అనుమానించారు.  అల్లుడు నరేశ్, కూతురు కలిసి ఉండాలంటే.. సురేశ్ ను చంపాలని  వెంకటయ్య ప్లాన్ చేశాడు. 

హైదరాబాద్ కొత్తపేటలోని స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వాహకుడు చిక్కు కిరణ్ కుమార్‌ అలియాస్ సీకే కుమార్ ను కాంటాక్ట్ అయ్యాడు. నరేశ్​మరో మహిళతో సహజీవనం చేస్తూ ఒక పాపకు జన్మనిచ్చాడని, ఇందుకు అతని అన్న సురేశ్ సపోర్ట్ ఉందని నిఘా పెట్టిన కిరణ్​వివరాలను సేకరించి ఇచ్చాడు. 

అంతేకాకుండా అతడిని మర్డర్ చేసేందుకు వెంకటయ్యతో అగ్రిమెంట్ చేసుకుని.. గతంలో తాను నేవీ కమ్యూనికేషన్ వింగ్ లో జాబ్ చేశానని, ఆధారాలు దొరక్కుండా హత్య చేస్తానని నమ్మించాడు. రూ.15 లక్షలకు కుదుర్చుకోగా వెంకటయ్య  రూ.2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. అనంతరం కిరణ్ తన బంధువైన ముషం జగదీశ్​కు రూ.3 లక్షలు ఇస్తానని ఆశ చూపి మర్డర్ లో సహకరించేటట్టు మాట్లాడుకుని..  వారు నెల రోజులు నల్గొండలో సురేశ్ కదలికలపై రెక్కీ వేశారు. 

ఫొటోలు ప్రింట్ కావాలంటూ వెళ్లి..

ఈనెల11న సాయంత్రం కిరణ్ కుమార్, జగదీశ్​నల్గొండ రామగిరి సెంటర్ లోని మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ కు వెళ్లారు. ఫొటోలు ప్రింట్ కావాలంటూ సురేశ్ ను అడిగి వెంటనే కత్తులతో దాడి చేసి అతడిని చంపేశారు. ఆ తర్వాత బైక్ పై హైదరాబాద్ పారిపోయారు. పోలీసులు బుధవారం నిందితులు వెంకటయ్య, కిరణ్​కుమార్, జగదీశ్​, ఉమామహేశ్వరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.  

నిందితుల వద్ద కారు, రెండు బైకులు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన నల్గొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి, నల్గొండ టూ టౌన్ సీఐ రాఘవరావు  టీమ్ లను ఎస్పీ అభినందించారు.