నల్గొండ అర్బన్, వెలుగు : మహబూబ్ నగర్ నుంచి రామకృష్ణారావు, రంగారెడ్డి నుంచి చెన్నారెడ్డి, ఖమ్మం నుంచి జలగం వెంగళరావు సీఎంలు అయ్యారని, తాను కూడా ఎప్పుడో ఓసారి నల్లగొండ నుంచి సీఎం అవుతానని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, నల్గొండ కాంగ్రెస్అభ్యర్థి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు సీఎం కావాలన్న కోరిక లేకున్నా ఎప్పుడో ఒకసారి అయి తీరుతానన్నారు.
తన చర్మంతో చెప్పులు కుట్టించినా నల్లగొండ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. మరోసారి గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్, ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటో తారీఖున వేతనాలు చెల్లిస్తామన్నారు. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి సంస్కారహీనుడని, బస్సు కిరాయిలకు డబ్బులు లేని జగదీశ్ రెడ్డి అక్రమంగా రూ.5వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నల్గొండ టౌన్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, నల్లగొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్ది సుమన్, తిప్పర్తి జడ్పీటీసీ పాశం రామ్ రెడ్డి పాల్గొన్నారు.