నల్గొండ జిల్లా: మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీని బొంద పెట్టాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం చౌటుప్పల్ మండలం అలంపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున ఉత్తమ్ ప్రచారం నిర్వహించారు. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ మునుగోడు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు అంటూ కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మునుగోడు ఎన్నిక కోసమే కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు అంటున్నారని, నిజానికి ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఇందిరా గాంధీదే అని గుర్తు చేశారు. పాల్వాయి స్రవంతిని గెలిపిస్తే తానే దగ్గరుండి నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.