కోదాడ, వెలుగు : కోదాడ వరద బాధితులకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అండగా నిలవడం అభినందనీయమని మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, ఎంఈవో సలీం షరీఫ్ అన్నారు. కోదాడలోని బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు నిత్యావసరాల సరుకులు సేకరించి శుక్రవారం పట్టణంలోని 13వ వార్డులో వరద బాధితులకు చైర్పర్సన్, ఎంఈవో చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే సామాజిక సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. వరద బాధితులకు తమ వంతు సహాయం అందించి బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, కౌన్సిలర్ రమ, హెచ్ఎం మార్కండేయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.