- చైర్మన్‌కు చెప్పకుండా వెళ్లిపోయిన రమణాచారి
- జిల్లా కేంద్రంలో ఇల్లు ఖాళీ
- ఏడాది కింద సిద్దిపేట నుంచి స్పెషల్‌గా రప్పించిన కేసీఆర్
- మున్సిపాలిటీలో అక్రమాలకు పాల్పడ్డాడంటూ ఫిర్యాదుకు సిద్ధమైన కాంగ్రెస్ కౌన్సిలర్లు
నల్గొండ, వెలుగు : నల్గొండ మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి గురువారం ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పబ్లిక్హెల్త్ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.వెంకటేశ్వర్లును ఇన్చార్జి కమిషనర్‌గా నియమించారు. గురువారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, తన రిజైన్ విషయాన్ని రమణాచారి మున్సిపల్ చైర్మన్‌కు చెప్పకుండానే వెళ్లిపోయారు. అంతేగాకుండా నల్గొండలోని ఇంటిని కూడా ఖాళీ చేయడం చర్చనీయాంశమైంది. మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ పట్టణాన్ని దత్తత తీసుకున్న తర్వాత రమణాచారిని సిద్ధిపేట నుంచి నల్గొండకు ప్రత్యేకంగా రప్పించారు. ఆయన పదవీ కాలం ముగిసినా టైం పొడిగించి మరీ తీసుకువచ్చారు. 2022లో డ్యూటీలో చేరిన రమణాచారి పట్టణంలో రూ.1300 కోట్ల పనులకు ప్రణాళికలు రూపొందించారు. అయితే, ఇప్పటివరకు రూ.200 కోట్ల పనులు మాత్రమే పూర్తి చేయగలిగారు.
అక్రమాలపై ఫిర్యాదుకు సిద్ధం
రమణాచారి హయాంలో మున్సిపాలిటీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్లు విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. రెండోదఫాలో చెత్త బుట్టలు పంపిణీ చేయకుండానే బిల్లులు కాజేశారని, మున్సిపాలిటీలో 40 మంది సిబ్బంది పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారని, దీనికి ఆయనే బాధ్యుడంటున్నారు. క్లాక్‌టవర్ నుంచి మర్రిగూడ బైపాస్ వరకు వేసిన పెద్ద రోడ్డు నిర్మాణంలోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయంటున్నారు. జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన బొమ్మల వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆర్ అండ్‌బీ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనులను పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్తో చేయించారని, టెండర్ల వ్యవహారంలో రూల్స్ బ్రేక్ చేశారని చెప్తున్నారు. వీటికి సంబంధించిన ఆధారాలతో విజిలెన్స్ డిపార్ట్మెంట్కు కంప్లయింట్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే రమణాచారి పాలకవర్గానికి చెప్పా పెట్టకుండా రాజీనామా చేయడమే గాక, ఉన్నఫళంగా ఇల్లు ఖాళీ చేసిపోవడం అనుమానాలకు తావిస్తోంది.