అప్పుల్లో కూరుకుపోయిన నల్గొండ మున్సిపాలిటీ !

  • గత పాలకవర్గం నిర్వాకంతో రూ.30 కోట్ల భారం 
  • మున్సిపల్​చట్టానికి వ్యతిరేకంగా నిధులు ఖర్చు  
  • అవసరానికి మించి శానిటేషన్​సిబ్బంది
  • పాత పాలకవర్గం అవతవకలపై ఎంక్వైరీ
  • ప్రక్షాళన చేపట్టిన కొత్త పాలకవర్గం

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో గ్రేడ్​వన్​గా గుర్తింపు పొందిన నల్గొండ మున్సిపాలిటీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. గత పాలకవర్గం నిర్వాకంతో రూ.30 కోట్ల అప్పుల భారాన్ని కొత్త పాలకవర్గం మోయాల్సి వస్తోంది. మున్సిపల్​చట్టానికి వ్యతిరేకంగా గత పాలకవర్గంలో ఇష్టమొచ్చినట్లుగా నిధులు దుబారా చేశారు. కౌన్సిల్​ తీర్మానం లేకుండానే ఎడాపెడా నిధులు ఖర్చుపెట్టారు. చివరకు జాతీయ నాయకుల కార్యక్రమాలకు కూడా మున్సిపల్​ నిధులే వెచ్చించారు. జాతీయ నాయకుల వేడుకలకు సాధారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు ఖర్చు పెట్టాలి. కానీ, ఆ ఖర్చులు కూడా మున్సిపాలిటీ ఖజానాపైనే భారం మోపారు.

ఈ రకంగా ఒకటి, రెండుతో వదిలిపెట్టకుండా ఏకంగా వందల సంఖ్యలో పనులకు శాంక్షన్​ఆర్డర్లు ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్​పర్యటన పేరుతో కొన్ని, దశాబ్ది ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, రవాణా బిల్లులు, ప్రభుత్వ కార్యక్రమాలకు మున్సిపాలిటీ ఖజానా నుంచే డైవర్షన్​ చేశారు. పాలకవర్గం ఆమోదం లేకుండా అప్పటి కమిషనర్, కలెక్టర్​అఫ్రూవల్​తో అడ్డగోలుగా నిధులు ఖర్చు పెట్టినట్టు కొత్త పాలకవర్గం గుర్తించింది. 

పద్దుల పేరుతో నిధుల దుబారా..

సాధారణంగా మున్సిపాలిటీకి వచ్చే వివిధ గ్రాంట్లలో ఏదో ఒక పద్దు నుంచి అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంది. కానీ ఇక్కడేమో శాంక్షన్​చేసిన ప్రతీ పనికి పట్టణ ప్రగతి, జనరల్​ఫండ్, ఎల్ఆర్ఎస్​అని ఒక్కో పనికి మూడు పద్దుల నుంచి శాంక్షన్​ఆర్డర్లు ఇచ్చారు. మున్సిపాలిటీకి బడ్జెట్​ఏటా రూ.70 కోట్లు.. వచ్చే ఆదాయం మాత్రం కేవలం రూ.27 కోట్లే. మాజీ సీఎం కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకున్నాడని, ఏదో రూపంలో గ్రాంట్స్​వస్తాయని వందల సంఖ్యలో పనులకు ఆమోదం తెలిపారు. తీరా ప్రభుత్వం పడిపోవడంతో రూ.30 కోట్ల అప్పు మీద పడింది. దీంట్లో ఏడెనిమిది కోట్లు ఏదో విధంగా సర్దుబాటు చేశారు. బ్యాలెన్స్​రూ.23 కోట్లు ఎక్కడి నుంచి తేవాలో అర్థంకాక కొత్త పాలకవర్గం తర్జనభర్జన పడుతోంది. 

సిబ్బంది నియాకాల్లో అక్రమాలు..

మున్సిపాలిటీలో 900 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వచ్చిన ఆదాయంలో 65 శాతం జీతాలకే సరిపోతుంది. ఆఫీసులో అవసరానికి మించి 80 మంది పనిచేస్తుండగా, 30 మందిని ఏదోవిధంగా తొలగించారు. ఇంకో 50 మంది పనిచేస్తున్నారు. వీళ్లలో పీజీ చదవిన వాళ్లు కూడా ఉండటం గమనార్హం. శానిటేషన్​విభాగంలో పనిచేస్తున్న వీరంతా వార్డుల్లో కాకుండా ఆఫీసుల్లో తిష్టవేస్తున్నారు. 48 వార్డుల్లో వార్డుకు 15 మంది చొప్పున 720 మంది పనిచేయాలి. కానీ 12 మంది చొప్పునే పనిచేస్తున్నారు. దీంతో వార్డులో శానిటేషన్​సిబ్బందిపై పనిభారం పెరిగి పారిశుధ్యం నిర్మూలనలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

పొంతన లేని ఆదాయం..

అసలు మున్సిపాలిటీకి వచ్చే ఆదాయానికి ఖర్చుకు ఏ మాత్రం పొంతన లేకుండా పోయింది. ఉదాహరణకు ఇంటి పన్నుల వసూళ్లలోనే భారీ తేడాలు ఉన్నాయి. బోగస్ ఇంటి నంబర్లు వేయడంతో ఆదాయం లక్షల్లో చూపిస్తోంది. కానీ ఫీల్డ్ లో మాత్రం ఒక్కో ఇంటికి రెండు, మూడు నంబర్లు వేయడం వల్ల బిల్లుల్లో లక్షల్లో బకాయి ఉన్నట్టు రికార్డుల్లో నమోదైంది. దీంతో పక్కాగా ఇంటి పన్నులు అంచనా వేసేందుకు అధికారులు ఫీల్డ్ లో ఎంక్వైరీ చేస్తున్నారు. 

ప్రక్షాళన చేస్తున్నాం 

మున్సిపాలిటీపై రూ.30 కోట్ల అప్పులు ఉన్నాయి. ఏదో విధంగా కొన్ని బిల్లులు సర్దుబాటు చేశాం. ఆఫీసుల్లో స్టాఫ్​విషయంలో కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టాం. సంబంధం లేని శాఖల్లో శానిటేషన్​స్టాఫ్​ పనిచేస్తు న్నారు. వార్డుల్లో సిబ్బంది తక్కువగా ఉన్నారు. మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో నడిపిస్తాం. 

- బుర్రి శ్రీనివాస్​రెడ్డి, మున్సిపల్​చైర్మన్, నల్గొండ