- బిల్డింగ్, లేఅవుట్లు, ఇండ్లకు స్థానికంగానే పర్మిషన్
- నల్గొండలో ప్రారంభమైన నుడా సర్వీసులు
- నల్గొండ మున్సిపాలిటీతో సహా 51 గ్రామాలకు వర్తింపు
- కళాభారతి, ఉదయ సముద్రం కోసం రూ.233 కోట్లు మంజూరు
నల్గొండ, వెలుగు : నీలగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఫుల్ పవర్స్ వచ్చేశాయి. దీంతో నుడా పరిధిలోని గ్రామాలు, నల్గొండ మున్సిపాలిటీలో జరిగే ఇండ్ల నిర్మాణాలు, వెంచర్ల లేఅవుట్ల పర్మిషన్‌లన్నీ ఇక్కడి నుంచే ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబర్ 105 జారీ చేసింది. నల్గొండ పట్టణాన్ని నుడాగా మారుస్తూ గతేడాది డిసెంబర్‌లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అథారిటీ చైర్మన్‌గా కలెక్టర్, వైస్ చైర్మన్‌గా మున్సిపల్ కమిషనర్‌ను నియమించారు. ఫిబ్రవరిలో నుడా ఆఫీస్ ఓపెన్ చేసినా ఎలాంటి పవర్స్ ఇవ్వలేదు. ఏడు నెలల తర్వాత ఇప్పుడు నుడాకు ఫుల్ పవర్స్ ఇస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. దీంతో ఇక నుంచి వెయ్యి గజాల వరకు ఇండ్ల నిర్మాణాలు, బిల్డింగ్ పర్మిషన్, 10 ఎకరాల వరకు వెంచర్ లేఅవుట్ పర్మిషన్లు సులభతరం కానున్నాయి. ఇక నుంచి డీటీసీసీ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పర్మిషన్ల కోసం టీఎస్ బీపాస్ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్లు అక్కడి నుంచి సీపీవో లాగిన్‌కు వెళ్తాయి. అక్కడ వాటిని కలెక్టర్ పరిశీలించాక వైస్ చైర్మన్ అథారిటీకి వస్తాయి. పర్మిషన్లు ఇవ్వడంలో పాలకవర్గం జోక్యం ఉండదు.
నుడా పరిధిలో 51 గ్రామాలు
నుడా పరిధిలో నల్గొండ మున్సిపాలిటీతో పాటు, నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లోని 51 గ్రామాలను చేర్చారు. వీటి పరిధిలో జరిగే ఎలాంటి నిర్మాణాలైనా ఇక నుంచి నుడా అనుమతి పొందాల్సి ఉంటుంది. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ అనుమతితో ఆయా గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేస్తారు. మున్సిపాలిటీ జనాభా 1,65,3 28 కాగా, 51 గ్రామాల జనాభా 84,103. మొత్తం కలిపి నుడా పరిధిలో 2,49,431 జనాభా ఉంది. నుడా పరిధిలో మొత్తం ఆరు మండలాలు చేరుతున్నాయి. తిప్పర్తి, కనగల్, కట్టంగూరు, నార్కట్‌పల్లి, నకిరేకల్ మండలంలోని పలు గ్రామాలను నుడాలో విలీనం అయ్యాయి.
వెంచర్లతో నుడాకు ఇన్‌కం
ఇప్పటిదాకా ఖాళీగా ఉన్న నుడా ఖజనా ఇక నుంచి కాసులతో నిండిపోనుంది. నుడా పేరు మీద బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేసి చాలా కాలమైంది. అయితే పర్మిషన్లు ఇచ్చే పవర్స్ లేకపోవడంతో ఆ అకౌంట్లలో నయాపైసా జమ కాలేదు. ఇక నుంచి లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్లు, ల్యాండ్ పూలింగ్ వ్యవహారాలన్నీ నుడా నుంచే జరుగుతాయి. డెవలప్‌మెంట్ కోసం ఇప్పటికే నుడా దేవరకొండ రోడ్డు కతాల్‌గూడ సమీపంలో 53 ఎకరాలు, నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు పరిధిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి, 223 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ గుర్తించారు. ఎల్లారెడ్డిగూడెంలో 364 ఎకరాల ప్రభుత్వ భూమి, 314 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు రెవెన్యూ ఆఫీసర్లు తేల్చారు. ఈ భూములను డెవలప్ చేసి వెంచర్లు చేయడం ద్వారా నుడాకు ఆదాయం వస్తుందని ఆఫీసర్లు తెలిపారు.
కళాభారతి, ఉదయ సముద్రానికి
రూ.233 కోట్లు
నల్గొండలో కళాభారతి, హెలిప్యాడ్ నిర్మాణం, ఉదయ సముద్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.233.82 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఉదయ సముద్రం, వల్లభరావు చెరువు, ఛాయ, పచ్చలసోమేశ్వరాలయం, బాలాజీ టెంపుల్ అభివృ-ద్ధితో పాటు ఐటీ పార్క్ నుంచి ఉదయ సముద్రం వరకు రోడ్డు నిర్మాణానికి కలిపి మొత్తం రూ.139.21 కోట్లు కేటాయించారు. అలాగే రూ. 90.61 కోట్లతో క్లాక్ టవర్ సెంటర్‌లో కళాభారతి, రూ. 4 కోట్లతో హెలీప్యాడ్, డ్రైయిన్లను నిర్మించనున్నారు.
నుడా నుంచే పర్మిషన్లు
లే అవుట్లు, ఇండ్ల నిర్మాణాలు, బిల్డింగ్ పర్మిషన్లు అన్నీ నుడా నుంచే స్టార్ట్ చేశాం. పర్మిషన్ల కోసం మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఒకటి, రెండు రోజుల్లోనే పర్మిషన్లు ఇచ్చేస్తాం. నుడా పరిధిలోని గ్రామాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. – రమణాచారి, మున్సిపల్ కమిషనర్, నల్గొండ