- ఆరు గ్యారంటీలు ఎన్నికల కోడ్ కంటే ముందే ఇవ్వాలి
- ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలా.. అధికారంలో మరోలా కాంగ్రెస్ తీరు
- బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చింతల రామచంద్రారెడ్డి
నల్గొండ, వెలుగు : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ సంస్థలు, భూ మాఫియాపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడెందుకు వెనకడుగు వేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే, నల్గొండ పార్లమెంటు ఇన్ చార్జి చింతల రామచంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం నల్గొండలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో నిలదీస్తామన్నారు.
ఆరు గ్యారంటీల పథకాలకు రూ. 85 వేల కోట్లు అవసరమవుతాయని, వీటికి నిధులు ఎలా సమకూరుస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ చేయించాలని అడిగితే మంత్రి ఉత్తమ్ మాట్లాడిన తీరు సరైంది కాదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం ఎంత సమయంలో పూర్తి చేస్తారో జిల్లా మంత్రులు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి 9 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. రైతుబంధు కోసం బ్యాంకులో ఉన్న రూ.7700 కోట్లు ఎక్కడికి పోయాయని ప్రభుత్వాన్ని నిలదీశారు.
నెల రోజులు దాటినా రైతుబంధు ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని ఎన్నికల కోడ్ వచ్చేదాక జాప్యం చేయొద్దని సూచించారు. సమావేశంలో పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు కంకాణల శ్రీధర్ రెడ్డి, నూకల నర్సింహారెడ్డి, గార్లపాటి జితేంద్ర కుమార్, గోలి మధుసూధన్ రెడ్డి, డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, పోతెపాక సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.