నల్గొండ పార్లమెంట్ స్థానంలో..74.02 శాతం పోలింగ్ నమోదు

  •     జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన 

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ పార్లమెంట్ స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో 74.02 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి  వాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని వెల్లడించారు. మంగళవారం దుప్పలపల్లిలోని స్ట్రాంగ్ రూమ్​ను కలెక్టర్​ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్గొండ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన రాజకీయ పార్టీలు, ఎంపీ అభ్యర్థులు, ప్రజలు, అధికారులు, మీడియా ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

నల్గొండ పార్లమెంట్​నియోజకవర్గ పరిధిలోకి వచ్చే దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్​నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలన్నింటినీ అనుశెట్టి దుప్పలపల్లి గోదాంలో భద్రపర్చినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా సాధారణ పరిశీలకుడు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ, రాజకీయ పార్టీల ప్రతినిధులు

ఎంపీ అభ్యర్థులు సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచామని వివరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తోపాటు అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ఆర్డీవోలు, అడిషనల్ ఎస్పీ రాములునాయక్, డీఆర్వో రాజ్యలక్ష్మి, పరిశ్రమలశాఖ జిల్లా జనరల్ మేనేజర్ కోటేశ్వరరావు, జిల్లా ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు సంగీతలక్ష్మి, డీపీవో మురళి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భూమన్న, డీఎస్పీ శివరామిరెడ్డి, జిల్లా అధికారులు, తహసీల్దారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట భద్రత.. 

మిర్యాలగూడలోని ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేశామన్నారు. అనిశెట్టి దుప్పలపల్లి లోని స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 144 సెక్షన్‌‌‌‌‌‌‌‌తోపాటు మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు.24 గంటలు సాయుధ పోలీసుల రక్షణ, సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని వివరించారు.