నల్గొండ అర్బన్, వెలుగు: దొంగల ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్చేశారు. సోమవారం తన ఆఫీసులో మీడియా సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి వివరాలు తెలిపారు. జిల్లాలోని నాంపల్లి మండలం నామ నాయక్ తండాకు చెందిన కొడావత్ విక్రమ్, మల్లేపల్లి మండలం దంజిరాల్ తండాకు చెందిన వడ్త్య నాగరాజు, మిర్యాలగూడ మండలం కాల్వ తండాకు చెందిన ధనావత్ సందీప్ నాయక్, నారాయణపురం మండలం ముంబాయి తండాకు చెందిన జరుప్లా నవీన్ కుమార్ నలుగురు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. వీరు రంగారెడ్డి జిల్లా హయత్నగర్ లోని బంజారా కాలనీలో ఉంటున్నారు. చోరీలతో పాటు గంజాయి అమ్ముతున్నారు.
ఎంజీయూ, కామినేని కాలేజీ విద్యార్థులు, అవసరమైన వ్యక్తులకు అమ్మేందుకు ప్లాన్ చేస్తూ.. మద్రాస్ ఫిల్టర్ కాఫీ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా కనిపించగా నార్కట్ పల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. హైదరాబాదులో గంజాయిని కొని.. చోరీ చేసిన బైక్ లపై నార్కట్ పల్లికి వచ్చి అమ్మేందుకు ప్రయత్నించామని నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. ఇప్పటికే వివిధ పోలీసు స్టేషన్లలో 50 కేసుల్లో నిందితులుగా ఉండి అరెస్టై జైలుకు వెళ్లొచ్చారు. అయినా ప్రవర్తనలో మార్పు రాక, చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనే ప్లాన్ చేసి గంజాయి అమ్మేందుకు యత్నిస్తూ పట్టుబడ్డారు. నిందితుల వద్ద 2 కేజీల గంజాయి, 4 బైక్ లు, 1 ట్యాబ్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు రిమాండ్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. నార్కట్ పల్లి సీఐ కె. నాగరాజు, ఎస్ఐ డి. క్రాంతి కుమార్, ఏఎస్ఐ ఆంజనేయులు, సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.