- గణపురం పెద్దమ్మ గుడిలో తుపాకులు దాచిన నిందితులు
- నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
నల్గొండ అర్బన్, వెలుగు : నాటు తుపాకులు పట్టుకొని, నక్సలైట్లమంటూ ప్రజలను, రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్ చేసిన ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను నల్గొండ ఎస్పీ చందనాదీప్తి ఆదివారం వెల్లడించారు. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం గణపురం శివారులోని పెద్దమ్మ తల్లి గుడిని గత నెల 28న అదే గ్రామానికి చెందిన తోటకూరి పెద్ద వెంకటయ్య క్లీన్ చేస్తుండగా మూడు తుపాకులు కనిపించాయి.
దీంతో ఆయన గ్రామస్తుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు తుపాకులను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన తోటకూరి శేఖర్ అనే వ్యక్తి తుపాకులు కలిగి ఉన్నాడని హాలియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లాడని గ్రామస్తులు చెప్పడంతో అతడిపై నిఘా పెట్టారు.
ఆదివారం అంగడిపేటలో తిరుగుతున్న శేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అక్రమంగా తుపాకులు కలిగి ఉన్నాడని నమోదైన కేసులో మిర్యాలగూడ జైలులో ఉన్న టైంలో శేఖర్‌కు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం, మదిపల్లికి చెందిన డ్రైవర్ గుంటుక రమేశ్‌తో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన లక్ష్మీనారాయణ, తొర్రూరు మండలం మదిపల్లికి చెందిన శ్రీనివాసులుతో కలిసి తుపాకులు కొని వ్యాపారులను బెదిరించేందుకు ప్లాన్ చేశారు.
ఇందులో భాగంగా విశాఖపట్నం దగ్గర్లలోని జీకే వీధి సాపర్లలో తుపాకులు కొని శేఖర్ ఇంట్లో దాచి పెట్టారు. ఇంట్లో ఉంటే ఎవరైనా చూస్తారని భావించి తర్వాత పెద్దమ్మ గుడిలో భద్రపరిచినట్లు శేఖర్ ఒప్పుకున్నాడని ఎస్పీ తెలిపారు. అతడు ఇచ్చిన సమాచారంతో మిగిలిన నిందితులను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితులను పట్టుకున్న కొండమల్లేపల్లి సీఐ కే.ధనుంజయ్, గుడిపల్లి ఎస్సై డి.నర్సింహులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.