
- ఐదుగురి రిమాండ్, పరారీలో ఇద్దరు
- పంచాయతీ ఎన్నికలే టార్గెట్ గా తయారు
- నల్గొండ ఎస్పీ శరత్ చంద్రపవార్ వెల్లడి
నల్గొండ, వెలుగు : కల్తీ మద్యం ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.25 లక్షల విలువైన 600 లీటర్ల స్పిరిట్, 660 లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ డీపీఓలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలోని చండూరు సాయినగర్ కు చెందిన ఎర్రజెల్ల రమేశ్ కోళ్లఫామ్ నిర్వహిస్తాడు. చండూరులో మటన్ బిజినెస్ చేసే మహమ్మద్ జానీ పాషా, చండూరుకు చెందిన దోమలపల్లి యాదగిరి, కనగల్ మండలం జి. యడవెల్లికి చెందిన బొమ్మరబోయిన భార్గవ్, చండూరుకు చెందిన సాయం ఉపేంద్ర, చండూరు మండలం కస్తాలకు చెందిన జాల వెంకటేశ్ ముఠాగా ఏర్పడ్డారు.
జానీపాషా హైదరాబాద్ చైతన్యపురిలో మటన్ షాపులో చేసేటప్పుడు తుర్కయంజాల్ కు చెందిన శ్రీనివాస్ తో పరిచయమైంది. అతని వద్ద రెండేండ్లు డ్రైవర్ గా పని చేశాడు. అతడి బావమరిది బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ్ నుంచి ముడి సరుకు తీసుకొచ్చేవారు.
ఎన్నికల్లో సేల్ చేయడమే టార్గెట్..
6 నెలల కింద బెంగళూర్ కు చెందిన శ్రీనివాస్ గౌడ్ కు జానీకి ఫోన్ చేసి పంచాయతీ ఎన్నికల్లో మద్యం ఎక్కువ సేల్ అవుతుందని, నకిలీ మద్యం తయారు చేస్తానని, రూ.5 లక్షలు ఇస్తే రూ.10 లక్షల మద్యం తయారు చేస్తానని చెప్పాడు. రమేశ్ కోళ్లఫామ్ కు చెందిన తోటలో తయారీకి ప్లాన్ చేశారు. గత ఫిబ్రవరి లో బెంగళూర్ లోని శ్రీనివాస్ గౌడ్ కు రూ.6 లక్షలు ఇచ్చి 5 డ్రమ్ముల స్పిరిట్ ను తీసుకొచ్చి తోటలో దాచారు. అక్కడ కల్తీ మద్యం తయారు చేసి10 లీటర్లు ఉండే బాటిల్స్ నింపారు. ఒక్క బాటిల్ రూ.10వేలకు అమ్మేందుకు నిర్ణయించారు. మునుగోడులోని వైన్ షాప్ పార్ట్ నర్ జాల వెంకటేశ్ ని కలిశారు. అతనికి జానీపాషా ఆటో డ్రైవర్ సాయం ఉపేంద్రకు ఇచ్చి పంపిస్తుండగా పోలీసులు తనిఖీల్లో దొరికిపోయారు.
విచారణలో నిందితులు నేరం ఒప్పుకోగా.. నాంపల్లి పీఎస్ లో కేసు నమోదు చేశారు. ఎర్రజెల్ల రమేశ్, జానీ పాషా, బొమ్మరబోయిన భార్గవ్, సాయం ఉపేంద్ర, జాల వెంకటేశ్ ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ్, చండూరుకు చెందిన దోమలపల్లి యాదగిరి పరారీలో ఉన్నారు. దేవరకొండ ఏఎస్పీ పి.మౌనిక పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ సీఐ రమేశ్ బాబు, ఎస్ఐలు మహేందర్, శివ ప్రసాద్, నాంపల్లి ఎస్ఐ శోభన్ బాబు, సిబ్బంది, ఎక్సైజ్ పోలీసులు కలిసి సంయుక్తంగా కేసును ఛేదించారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినంధించారు.