ఆ ఏడు పార్టీలు నాయకత్వాన్ని.. బడుగు, బలహీన వర్గాలకు అప్పగించాలి

నల్గొండ అర్బన్, వెలుగు : ఏడు శాతం లేని రెడ్డి, వెలమ, కమ్మ అగ్రకులాలకు ఏడు పార్టీలేమిటని, ఆ పార్టీల నాయకత్వాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, సబ్బండ కులాలకు అప్పగించాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్​ విశారదన్ మహారాజ్ డిమాండ్ చేశారు.  సోమవారం నల్గొండలో ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధంలో భాగంగా నిర్వహించిన ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేసి మాట్లాడారు. రాష్ట్రంలో 93 శాతం  ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉండగా ఏడు శాతం లేని అగ్రకులాలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ , టీజేఎస్, సీపీఐ, సీపీఎం, వైఎస్ఆర్ టీపీలకు నాయకత్వం వహించడమేమిటన్నారు. 

ఇది పూర్తిగా సామాజిక న్యాయ సూత్రానికి, భారత రాజ్యాంగ సమానత్వ భావనకి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. అందుకే ఈ ఏడు అగ్రకుల పార్టీల వైఖరిని ధర్మ సమాజ్ పార్టీ తీవ్రంగా నిరసిస్తోందన్నారు. ఏడు పార్టీలకు ధర్మ సమాజ్ పార్టీ 7 డిమాండ్లతో గత నెల15న లెటర్లు రాయడం జరిగిందని, 15 రోజుల గడువిచ్చినా వారి నుంచి స్పందన లేకపోవడంతో తమ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలకు, పార్టీల దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చామన్నారు. మంగళవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, 13న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు రాస్తారోకోలు ఉంటాయన్నారు. 

ఈ అగ్రకుల పార్టీలు పునరాలోచించుకొని అధినాయకత్వాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అప్పగించాలని డిమాండ్  చేశారు. అప్పటివరకూ ఈ పార్టీల లీడర్లను ప్రజల్లో తిరగనివ్వమన్నారు. పార్టీ  జిల్లా అధ్యక్షుడు రాంబాబు మహారాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు యాతాకుల వెంకన్న , ఎల్లయ్య, శీను ,ఉపాధ్యక్షుడు శంకర్, గిరి, జగన్, కార్యదర్శులు రవి, వినోద్ , నాయకులు వంశీ, దినేశ్, సైదులు పాల్గొన్నారు.