- ప్రాజెక్టుల చుట్టే పాలిటిక్స్!
- వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్ష పార్టీలలకు ప్రాజెక్టులే ప్రధాన అస్త్రం
- ఇదే ఏజెండాతో ప్రత్యేక కార్యాచరణకు ఎంపీలు ఉత్తమ్, వెంకట్‌రెడ్డి ప్లాన్
- గండం నుంచి గట్టేక్కేందుకు ఎమ్మెల్యేల హడావుడి
నల్గొండ, వెలుగు ఉమ్మడి జిల్లాలో పాలిటిక్స్ ప్రాజెక్టుల చుట్టే తిరుగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారనున్నాయి. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని శపథం చేసిన పార్టీ అగ్రనేతలు పెండింగ్ ప్రాజెక్టుల పైన స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నల్గొండలో జరిగిన నిరుద్యోగ నిరసన సభలో ప్రధానంగా ప్రాజెక్టుల అంశాన్నే ఆ పార్టీ నేతలు ప్రస్తావించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ సాగర్ఆయకట్టు కింద ప్రకటించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలతోపాటు, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, తెలంగాణ వచ్చాక ఏడేళ్లలో కొత్తగా సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులపైన విమర్శలు గుప్పించారు.
ఎక్కడి పనులు అక్కడే..
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టుల్లో ఎలాంటి కదలిక లేకుండా పోయింది. కాంగ్రెస్ హయాంలో మొదలు పెట్టిన శ్రీశైలం సొరంగ మార్గం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 18 ఏళ్లు గడిచింది. దీనికి అనుసంధానంగా దేవరకొండ నియోజకవర్గంలో చేపడుతున్న పెండ్లిపాకల, నక్కలగండి రిజర్వాయర్లు, నకిరేకల్ నియోజకవర్గంలో బ్రహ్మణ వెల్లంల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులు మధ్యలోనే ఆగిపోయాయి. నకిరేకల్, మునుగోడు, నల్గొండ, దేవరకొండ నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి సమస్య తీర్చేందుకు అప్పటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టుబట్టి మరీ ప్రాజెక్టులు శాంక్షన్ చేయించారు. తెలంగాణ వచ్చాక ఈ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడమే మానేసింది. పైగా ఫ్లోరైడ్ సమస్య తీరుస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం తెరపైకి తెచ్చారు. దీనిలో భాగంగా తొమ్మిది రిజర్వాయర్లకు 2015లో కేసీఆర్ శివన్నగూడెం వద్ద శంకుస్థాపన చేశారు. ఎనిమిదేళ్లు గడుస్తున్నా రిజర్వాయర్ల పనులు పూర్తికాకపోగా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు వేయడంతో మొత్తం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది.
అయితే ఈ స్కీం కింద నిర్మిస్తున్న రిజర్వాయర్లలో సింగరాజుపల్లి, గొట్టిముక్కల వర్షపు నీటితో నింపే అవకాశం ఉన్నప్పటికీ ఫండ్స్ రిలీజ్ కాకపోవంతో పనులకు బ్రేక్ పడింది. వ్యవసాయ భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడంలో ఆలస్యమడం, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు, ఫారెస్ట్ క్లియరెన్స్ చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది. రిజర్వాయర్లు కంప్లీట్ చేయడంలేదనే మునుగోడు బైపోల్లో ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నాగార్జు నసాగర్ ఉప ఎన్నికలోనూ బీఆర్ఎస్ గట్టేక్కేందుకు నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో ప్రకటించిన నెల్లికల్లు లిఫ్ట్‌తో సహా అన్ని పనులు నత్తనడకన సాగుతున్నాయి. యాదాద్రి జిల్లా లో తలపెట్టిన బస్వాపురం రిజర్వాయర్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
ఎమ్మెల్యేల హడావుడి షురూ..
ఉమ్మడి జిల్లాలో కృష్ణా, గోదావరి జలాల ఆధారంగా లిఫ్ట్ స్కీంలు, రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతున్న ఆలేరు, భువనగిరి, నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, నల్గొండ, నాగార్జునసాగర్, మిర్యాల గూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గా ల్లో పూర్తికాని ప్రాజెక్టులు వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చూపనున్నాయి. ఈ గండం నుంచి గట్టేక్కేం దుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రాజెక్టుల పేరుతో హడావుడి షరూ చేశారు. జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సహకారంతో ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, కంప్లీట్ చేసేందుకు సీఎంతో చర్చించినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా పనులు కంప్లీట్ చేస్తామని సీఎం భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈనెలాఖరులో నార్కట్‌పల్లి మండలం బ్రహ్మణ వెల్లంల రిజర్వాయర్ సీ ఎం చేతుల మీదుగా ఓపెన్ చేసేందు కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.